Telugudesam: వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు: దేవినేని అవినాశ్
- ధర్మయుద్ధం చేశాం
- గుడివాడలో నాకు బలంలేదు
- పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు పోటీచేశాను
కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలైన టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్ తన నివాసంలో కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఓటమిపై ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. అధికారం ఉంది కదా అని ఇష్టంవచ్చినట్టు దాడులకు పాల్పడడం వైసీపీ కార్యకర్తలకు సరికాదని హితవు పలికారు. ఎలాంటి కష్టాల్లోనైనా తాను టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తనను దురదృష్టం వెంటాడిందని అవినాశ్ తెలిపారు. గుడివాడలో తనకు పెద్దగా బలం లేకపోయినా పార్టీ చీఫ్ ఆదేశాల మేరకు పోటీచేశానని, ఎన్నికల్లో ధర్మయుద్ధం చేశాని వివరించారు.