Andhra Pradesh: నయీం అనుచరుడు శేషన్న కోసం తెలంగాణ, ఏపీ పోలీసుల గాలింపు
- నయీం ఎన్ కౌంటర్ తర్వాత శేషన్న పరారీ
- ఆశ్రయం ఇచ్చిన మాజీ మావోయిస్టు
- పోలీసులకు విషయం తెలియడంతో ఇద్దరూ పరారీ
కొన్నాళ్ల కిందట పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుల కార్యకలాపాలపైనా పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. ఈ క్రమంలో నయీం ముఖ్య అనుచరుడిగా పేరుపొందిన శేషన్న కోసం తెలంగాణ, ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత శేషన్నకు మాజీ మావోయిస్టు వట్టి వెంకట్ రెడ్డి ఆశ్రయం ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంకట్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా సున్నిపెంట. అయితే, శేషన్నకు కర్నూలు జిల్లాలోని బొల్లవరంలోని తన బంధువుల ఇంట్లో ఆశ్రయం కల్పించినట్టు సమాచారం.
తమ ఆచూకీ పోలీసులకు తెలిసిందన్న సమాచారంతో శేషన్న, వెంకట్ రెడ్డి పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిన్న పోలీసులు వెంకట్ రెడ్డి నివాసంలో సోదాలు జరపగా, పెద్ద ఎత్తున మారణాయుధాలు దొరికాయి. అంతేకాకుండా, వెంకట్ రెడ్డి నివాసంలో భారీ డంప్ ఉండే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.