Andhra Pradesh: టీడీపీ నేతలతో చంద్రబాబు వ్యూహాత్మక భేటీ.. పలు అంశాలపై అభిప్రాయ సేకరణ!
- ఎగ్జిట్ పోల్స్, ఢిల్లీ టూర్ పై చర్చ
- రేపు ధర్నా నిర్వహించడంపై సమాలోచనలు
- మరికాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు తన నివాసంలో టీడీపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, తన ఢిల్లీ పర్యటనపై నేతలతో చర్చించారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
50 శాతం వీవీప్యాట్ యంత్రాలను ఈవీఎంలతో సరిపోల్చాలని రేపు ఢిల్లీలో చేయనున్న ధర్నాపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ తో పాటు ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర, బుద్ధా వెంకన్న, పంచుమర్తి అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం.