Chandrababu: ఎన్నో రాజకీయాలు చూశా, ఇలాంటి ఈసీని మాత్రం ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు
- 34 రోజుల తర్వాత రీపోలింగ్ ప్రకటన చేస్తారా?
- మేం ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు
- మోదీ, అమిత్ షాల కనుసన్నల్లో ఈసీ నడుచుకుంటోంది
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరాను కలిసి చంద్రగిరి రీపోలింగ్ అంశంపై ఫిర్యాదు చేశారు. ఆరోరాతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్ కు ఆదేశాలు ఎలా జారీచేస్తారంటూ నిలదీసినట్టు వెల్లడించారు.
పోలింగ్ జరిగిన తర్వాత రోజు రిటర్నింగ్ అధికారి ఇచ్చే నివేదిక ఆధారంగా రీపోలింగ్ ప్రకటన చేస్తారని, కానీ, నెలరోజుల తర్వాత ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేస్తే ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్ కు ప్రకటన చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. తాము కొన్ని చోట్ల రీపోలింగ్ జరపాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో రాజకీయాలను చూశానని, కానీ ఇలాంటి ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. మోదీ, అమిత్ షాల కనుసన్నల్లోనే ఈసీ నడుచుకుంటోందని, ఈసీ పనితీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాల్సిరావడం విచారించాల్సిన విషయం అని పేర్కొన్నారు.