Chandrababu: మా వాళ్లకు ఆ భయం లేదు: చంద్రబాబు
- చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించారు
- టీడీపీ ప్రజాప్రతినిధులపై ప్రజల్లో అసంతృప్తి లేదు
- తెలంగాణలో ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళితే ప్రజలు నిలదీశారు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ పార్టీ నేతలు, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, కార్యకర్తలతో అమరావతిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లడానికి భయపడనవసరం లేదని, చేసిన అభివృద్ధి పనులే వారికి ప్రజాదరణ కట్టబెట్టాయని అన్నారు.
తెలంగాణలో ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళితే ప్రజలు నిలదీశారని వెల్లడించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి లేదని అన్నారు. తాను 110 సభలు, రోడ్ షోలు నిర్వహిస్తే విపక్షనేత కనీసం 60-70 సభలు కూడా నిర్వహించలేకపోయారని జగన్ పై పరోక్ష వ్యాఖ్య చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త పొలిటికల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలని సలహా ఇచ్చారు. ఇక మీదట ప్రతి ఎన్నికలోనూ టీడీపీనే గెలవాలని, ఆ దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతేగాకుండా, టీడీపీ పార్టీ తరఫున కార్యకర్తల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.
ఇటీవల ముగిసిన పోలింగ్ సందర్భంగా ప్రత్యర్థులు ఎంతగా భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నించినా కార్యకర్తలు వెనుకంజ వేయలేదని ప్రశంసించారు. పోలింగ్ రోజు హింస, విధ్వంసాలకు రచన చేసి అమలు చేశారని, ఓటింగ్ శాతం భారీగా తగ్గించేందుకు కుట్రలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలను బెదిరింపులకు గురిచేశారని చెప్పారు.