UK: ఆరుగురు అమ్మాయిలకు కుచ్చుటోపీ పెట్టిన రొమాంటిక్ మోసగాడికి ఆరేళ్ల జైలుశిక్ష!
- లండన్ లో ఘటన
- అమ్మాయిలను మోసగించి రూ.7.2 కోట్లు దండుకున్న భారత సంతతి యువకుడు
- ఎట్టకేలకు దోషిగా నిరూపణ
లండన్ లో నివసించే కేయూర్ వ్యాస్ అనే భారత సంతతి యువకుడు బ్రిటీష్ పోలీసుల దృష్టిలో రొమాంటిక్ మోసగాడు అనే ముద్ర వేయించుకున్నాడు. ఆరుగురు అమ్మాయిలను ఆకట్టుకుని వారి నుంచి రూ.7.2 కోట్లు దండుకుని మోసగించిన ఘనుడు కేయూర్ వ్యాస్. వ్యాస్ వయసు 32 ఏళ్లే. అయితేనేం, అమ్మాయిల మనసు చదవడంలో దిట్ట. వారితో ఎలా మాట్లాడితే తన ఉచ్చులో పడతారో అతనికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఆరుగురు మహిళలతో రొమాన్స్ నడిపి వారి నుంచి 8 లక్షల పౌండ్లు రాబట్టాడు.
తప్పుడు ప్రొఫైల్స్ తో ఆన్ లైన్ లో అమ్మాయిలతో పరిచయం పెంచుకోవడం, తన వలలో పడ్డారని నిశ్చయించుకున్నాక వారి నుంచి డబ్బులు గుంజడం వ్యాస్ ప్రధాన వ్యాపకం. వారి నుంచి డబ్బులు రాబట్టేందుకు లేని కంపెనీలు ఉన్నట్టుగా భ్రమింపజేసేవాడు. వాటిలో పెట్టుబడి పెడితే పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని ఊరించేవాడు. అతడి మాటలు నిజమేనని నమ్మి వారిలో కొందరు ఉన్నదంతా ఊడ్చి అతడి చేతిలో పెట్టారు.
ఆ తర్వాత తాము మోసపోయామని గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేస్తే తనకిచ్చిన సొమ్ము అంతా నష్టపోతారని బెదిరించేవాడు. దాంతో కొందరు డబ్బు కోసం మిన్నకుండిపోయేవారు. అయితే ఎంతకీ డబ్బు ఇవ్వకపోవడంతో వ్యాస్ తీరుపై అనుమానంతో కొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి బండారం బట్టబయలైంది. వ్యాస్ కేసును నాలుగేళ్లుగా విచారణ జరిపిన కింగ్ స్టన్ క్రౌన్ కోర్టు అతడికి ఆరేళ్ల జైలుశిక్ష విధించింది.