KCR: రాష్ట్రంలో 23 మంది చనిపోయిన తర్వాతనా ఫ్రీ రీవాల్యుయేషన్?: కేసీఆర్ పై టి-బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఫైర్

  • చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది
  • ముందే సమీక్ష జరిపి ఉంటే కొంతమంది ప్రాణాలైనా నిలిచేవి
  • మే 2న బంద్ నిర్వహిస్తాం

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మార్కుల్లో చోటుచేసుకున్న గందరగోళం అనేకమంది విద్యార్థుల బలవన్మరణానికి కారణం కావడం పట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం కావడానికి సీఏం కేసీఆర్ అసంబద్ధ నిర్ణయాలే కారణమని మండిపడ్డారు. ఇంటర్ మార్కుల అంశంపై కేసీఆర్ సకాలంలో సమీక్ష జరిపి, ఆ నిర్ణయాలను వెల్లడించి ఉంటే కొన్ని ప్రాణాలైనా నిలిచేవని అభిప్రాయపడ్డారు.

అయితే, 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత తీరిగ్గా సమీక్షలు జరిపి, ఫ్రీ రీవాల్యూయేషన్, ఫ్రీ వెరిఫికేషన్ అని చెప్పడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని విమర్శించారు. ఈ వ్యవహారం పట్ల విద్యాశాఖ మంత్రి నైతికంగా బాధ్యత వహించి ఆయనన్నా రాజీనామా చేయాలి, లేక ముఖ్యమంత్రే ఆయన్ను బర్తరఫ్ చేయాలి అంటూ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

తాము విద్యార్థుల క్షేమం కోసం రాజకీయాలు చేస్తున్నామని, మీ బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూలేరని కేసీఆర్ ను హెచ్చరించారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు బీజేపీ మడమతిప్పని పోరాటం చేస్తుందని, అందులో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

అంతేగాకుండా, ఇంటర్ విధానాన్ని ఎత్తివేసి, సీబీఎస్ఈ తరహాలో ప్లస్ టూ విద్యావిధానం తీసుకువస్తానని చెబుతున్నారని, ఆ మేరకు పత్రికల్లో లీకులు ఇస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణ చేతకాక 10 ప్లస్ 2 విధానం తీసుకురావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది ప్రభుత్వ తిరోగమన చర్యలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఇది తుగ్లక్ చర్య తప్ప మరొకటి కాదని మండిపడ్డారు.

తలనొప్పి వస్తే మందు పూసుకోండి లేదా మర్దన చేయండి, అంతే తప్ప ఏకంగా తలే నరికేస్తాం అంటూ అంతకుమించిన మూర్ఖత్వం మరొకటి లేదని అన్నారు. ఇక, ఈ విషయంలో బీజేపీ కార్యాచరణను వెల్లడించారు. ఏప్రిల్ 28న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడతామని, 29న తల్లిదండ్రులతో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుపుతామని చెప్పారు. మే2న రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపు ఇవ్వనున్నట్టు లక్ష్మణ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

  • Loading...

More Telugu News