Chandrababu: ముంబయిలో అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న చంద్రబాబునాయుడు
- ఈవీఎంలపై తన వాదనలు వినిపించిన ఏపీ సీఏం
- ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటూ పిలుపు
- మోదీపై విమర్శలు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ముంబయిలో ఇవాళ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈవీఎం లోపాలు, ఈసీ వైఫల్యాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఏపీలో ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో 2 నుంచి 6 గంటల పాటు ఈవీఎంలు మొరాయించాయని తెలిపారు. కొన్నిప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ ప్రారంభమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
చివరికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కూడా ఓటు వేయలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఆయన సైతం ఈవీఎం మొరాయించడంతో వెనుదిరగాల్సి వచ్చిందని వెల్లడించారు. పోలింగ్ సందర్భంగా ఏర్పాట్లు చేయడంలో ఈసీ విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు.
"ఈవీఎంలలో లోపాలు వస్తే సరిదిద్దేందుకు తగిన సిబ్బంది లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరికి ఓటు వేశామనేది వీవీ ప్యాట్ లో 7 సెకన్ల పాటు కనిపించాలి, కానీ 3 సెకన్లే కనిపించింది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు సరైన విధానం కాదని చాలా దేశాలు గుర్తించాయి. అనేక అభివృద్ధి చెందిన దేశాలు సైతం బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి" అని పేర్కొన్నారు.
అంతకుముందు ఆయన ప్రధాని నరేంద్రమోదీపైనా విమర్శలు గుప్పించారు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఐటీ, ఈడీ, సీబీఐ వంటి రాజ్యాంగ సంస్థలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. చివరికి విపక్ష నేతల ఇళ్లలో కూడా దాడులు చేయిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.