: ఇమ్రాన్, నవాజ్ షరీఫ్ 'ఫ్రెండ్లీ మ్యాచ్'!
పాకిస్తాన్ ప్రధానిగా రంగం సిద్ధం చేసుకుంటోన్న పీఎంఎల్-ఎన్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్.. తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తో 'ఫ్రెండ్లీ మ్యాచ్'కు సిద్ధమయ్యారు. అదేనండీ, పాక్ ఎన్నికల్లో షరీఫ్ పార్టీకి 123 స్థానాలు దక్కడంతో ఇప్పుడక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడక తప్పదన్న సంగతి తెలిసిందే కదా. దీంతో, నవాజ్ షరీఫ్ మిత్ర పక్షాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో ఇమ్రాన్ పార్టీకి స్నేహ హస్తం చాచారు. ఈ ఉదయం ఆయన్ను లాహోర్ లోని షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసి ఆయనతో కొంచెంసేపు గడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షరీఫ్.. దేశాన్ని సంక్షోభంలోంచి బయటపడేసేందుకు తామిద్దరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
కాగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇమ్రాన్ ఖాన్.. నవాజ్ షరీఫ్ తోపాటు అతని సోదరుడు షాబాజ్ షరీఫ్ లపై తీవ్ర ఆరోపణలతో వాతావరణాన్ని వేడెక్కించాడు. అయితే, షరీఫ్ మాట్లాడుతూ, ప్రచారంలో తనను దూషించిన వారందరినీ క్షమించేస్తున్నానని అన్నారు. అంతేగాకుండా, మహ్మద్ ప్రవక్త ప్రవచించిన ఓ సూక్తిని కూడా ఉదహరించారు. ఏ వ్యక్తిపై అయినా కక్ష పెంచుకుంటే, మూడ్రోజులకు మించి దాన్ని మనసులో ఉంచుకోరాదని ప్రవక్త సూచించాడని షరీఫ్ వివరించారు.