Chandrababu: జనం ఇప్పటికే తీర్పు ఇచ్చేశారు, వైసీపీ నేతలు అంత ఆయాస పడనక్కర్లేదు: చంద్రబాబు
- వచ్చేస్తున్నాం అంటున్నారు, ఎక్కడికి మీరొచ్చేది?
- రాష్ట్ర పాలనను కేంద్రం చేతిలో పెట్టాలని ఉత్సాహపడుతున్నారు
- వైసీపీ నేతలకు బాధ్యతలేదు
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ అధినేత జగన్ తదితరులపై విమర్శనాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజక్టు వివరాలు తెలిపేందుకు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన చివర్లో రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. గెలిచేస్తున్నాం, వచ్చేస్తున్నాం అంటూ వైసీపీ నేతలు అనవసరంగా ఆయాసపడిపోతున్నారని, ఎక్కడికి మీరు వచ్చేది? ప్రజలు ఎప్పుడో తీర్పు ఇచ్చేశారని చంద్రబాబు స్పష్టం చేశారు.
జగన్ పోలింగ్ అవగానే హైదరాబాద్ వెళ్లిపోయి విహారయాత్ర చేసుకుంటాడు, మీరెందుకు ప్రజలను ఇబ్బందులు పెట్టాలని చూస్తారు? అంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు. రాష్ట్ర పాలనను జగన్ కేంద్రం చేతిలో పెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నాడంటూ చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
బాబాయి హత్యను గుండెపోటుగా చిత్రీకరించి, కేసు విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎస్పీని బదిలీ చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం సొంత బాబాయిని చంపి అరాచకం చేశారని సీఎం ఆరోపించారు. పోలింగ్ సందర్భంగా ఈవీఎంలు మొరాయించి ఆలస్యం అయిందని, మళ్లీ ఈవీఎంలు పనిచేయడం మొదలుపెట్టగానే వైసీపీ హింసకు తెరలేపిందని మండిపడ్డారు. అంత బీభత్సం చేసి మళ్లీ గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేస్తూ నటిస్తారా? అంటూ నిలదీశారు.