Chandrababu: పోలవరం ప్రాజక్టు ఇప్పుడాపితే శాశ్వతంగా ఆగిపోతుంది: చంద్రబాబు
- డబ్బులు ఇవ్వడంలేదు
- తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు
- కేంద్రంపై చంద్రబాబు విమర్శలు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజక్టు పనులు జరుగుతున్న తీరుపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకుండా ఎన్ని ఇబ్బందులకు గురిచేయాలో అన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. అయితే, పోలవరం ప్రాజక్టును ఇప్పుడు ఆపితే శాశ్వతంగా ఆగిపోతుందన్న కారణంతో ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు వెళుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజక్టుకు కేంద్రం నుంచి ఇప్పటివరకు రావాల్సింది రూ.4508 కోట్లు అని తెలిపారు. కేంద్రం డబ్బులు ఇవ్వకుండా, డీపీఆర్ పూర్తిచేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజక్టు కోసం రూ.16,371 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.
పోలవరం జాతీయ ప్రాజక్టుగా ప్రకటించిన తర్వాత ఖర్చు చేసింది రూ.11,231 కోట్లు అని చెప్పారు. పీపీఏ ద్వారా ప్రాజక్టు పనుల కోసం కేంద్రం ఇచ్చింది రూ.6727 కోట్లు అని, ఇంకా రావాల్సింది రూ.4508 కోట్లు అని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజక్టు పూర్తి వ్యయం రూ.57,940 కోట్లుగా అంచనా రూపొందించామని చంద్రబాబు తెలిపారు.