BJP: చంద్రబాబు చింతామణి డ్రామాను రక్తికట్టిస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ
- టీడీపీ ఓ పార్టీ కాదు... డ్రామా కంపెనీ
- కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకుంటున్నారు
- ఈసీని కూడా బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారు
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబుపైనా, టీడీపీపైనా విమర్శలు చేశారు. టీడీపీ ఓ పార్టీ కాదని, అదో డ్రామా కంపెనీ అని అభివర్ణించారు. అభ్యంతరాలున్నాయంటూ ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి చంద్రబాబు డ్రామాలు ఆడారంటూ మండిపడ్డారు. చంద్రబాబు చింతామణి నాటకాన్ని రక్తి కట్టించేలా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ కూడా కలిశారు. ఇతర బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు, విజయ్ బాబులతో కలిసి ఈసీ వద్దకు వెళ్లిన కన్నా, ఎన్నికల సందర్భంగా టీడీపీ అక్రమాలను కట్టడి చేయాలని కోరారు.
ద్వివేదీతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈసీని తన పని తాను చేసుకోనీయకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ముందరి కాళ్లకు బంధం వేయడంలో దిట్ట అని ఆరోపించారు. కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకుంటూ స్టిక్కర్లేసుకుంటున్నారని విమర్శించారు. ఇదే విషయం ఈసీకి ఫిర్యాదు చేశారు.