Chandrababu: నేనేమన్నా కోడికత్తినా!... ఒకవారం నుంచి కేసీఆర్ ను ఉతికారేశా: పెడనలో చంద్రబాబు వ్యాఖ్యలు
- కేసీఆర్ పెత్తనం నాపైనా?
- ఖబడ్దార్ కేసీఆర్ వదిలిపెట్టం
- నీ జీవితం అంతా అబద్ధాలే
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా పెడన రోడ్ షోలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల దాడి చేశారు. ఒక వారం నుంచి కేసీఆర్ ను ఉతికారేశానని, బట్టలు ఎలా ఉతుకుతారో అలాగే ఉతికానని అన్నారు.
"కేసీఆర్ నా మీద పెత్తనం చేయాలనుకుంటున్నాడు. నేనేమన్నా కోడికత్తినా పెత్తనం చేయడానికి! కేసీఆర్ ఖబడ్దార్, ఇప్పుడు కూడా అబద్ధాలు చెబుతున్నావ్. అది నీకు అలవాటు. నీ జీవితం అంతా అబద్ధాలే. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు, 2009లో మనతో పొత్తుపెట్టుకున్నాడు, 2014లో కథలు చెప్పాడు. ఆయనకు తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కొనుక్కుని మహానాయకుడిలా పోజులు కొడుతున్నాడు" అంటూ విమర్శించారు.
"మనల్ని ఎంత వల్గర్ గా తిట్టాడు? ఆంధ్రులు తెలంగాణ ద్రోహులన్నాడు. తెలుగుతల్లిని తిట్టాడు. మన ఉలవచారు పశువులు తింటాయట. మన బిర్యానీ పేడ బిర్యానీ అట. కేసీఆర్, నువ్వెక్కడ పెరిగావు?" అంటూ నిలదీశారు.