Chandrababu: ఏం, నాకు పనిలేకనా మీకు ఫోన్లు చేసేది?: పెడనలో ప్రజలను ప్రశ్నించిన చంద్రబాబు
- ప్రతిరోజూ నా ఫోన్లు మీకు వస్తున్నాయా?
- పెన్షన్ తీసుకున్నప్పుడు నా ఫోన్ వస్తుందా?
- రేషన్ తీసుకుంటే ఫోన్ వస్తుందా?
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా పెడనలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులను తన ప్రసంగంలో భాగం చేస్తూ వాళ్ల నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఊరికి పదిమందిని పెడతామని కోడికత్తి పార్టీ చెబుతోందని, దేనికి పదిమంది? అని ప్రశ్నించారు. తాను ప్రజలు ఆఫీసులకే రానవసరంలేదని చెబుతున్నానని, ఒక్క ఫోన్ కొడితే పనయ్యేలా ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. అప్పటికీ పని జరగకపోతే ఒక యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఐదు నిమిషాల్లో పనిపూర్తిచేసి తానే మళ్లీ ఫోన్ చేసి 'పనయింది తల్లీ' అంటూ సమాధానం చెబుతానని వివరించారు. ఈ సందర్భంగా ప్రజలను అనేక ప్రశ్నలు అడిగారు.
" నా ఫోన్లు మీకు ప్రతిరోజూ వస్తున్నాయా అమ్మా? పెన్షన్ తీసుకున్నప్పుడు ఫోన్ వస్తుంది.. వచ్చిందా? రేషన్ తీసుకున్నప్పుడు మీకు ఫోన్ వస్తుంది... వస్తుందా? బీమా తీసుకున్నప్పుడు ఫోన్ వస్తుంది.. వస్తుందా? దేనికోసం! నాకు పనిలేకనా! కాదు, వాస్తవాలు తెలుసుకోవడం కోసం. నిజానిజాలు తెలుసుకుంటే అందరికీ భయం ఉంటుంది. అందరూ కూడా సక్రమంగా పనిచేస్తారన్న ఉద్దేశంతోనే దీనికి శ్రీకారం చుట్టాను" అంటూ వివరణ ఇచ్చారు.