Andhra Pradesh: కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య వైసీపీ విద్వేషాలను రెచ్చగొడుతోంది!: ఏపీ సీఎం చంద్రబాబు
- టీడీపీకి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
- పార్టీ నేతలు ఇకపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి
- అమరావతిలో టీడీపీ అధినేత టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీతోనే సాధ్యమని నమ్ముతున్నట్లు చెప్పారు. ఇకపై ప్రతీ నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ, రోజువారీ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని టీడీపీ శ్రేణులకు బాబు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
తుది ఓటర్ల జాబితా విడుదల అయిందనీ, అందరూ తనిఖీ చేసుకోవాలని ఏపీ సీఎం సూచించారు. పోలింగ్ బూత్ ల వారీగా పార్టీ విజయం కోసం కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. ఏపీలో దొంగ ఓట్ల ఎత్తులను చిత్తు చేశామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలన్నారు. సమాజంలో అన్ని కులాలు, మతాలను టీడీపీ గౌరవిస్తోందని చంద్రబాబు తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో గతంలో కంటే బాగా పనిచేసినవారికి గుర్తింపు లభిస్తుందన్నారు.