Tollywood: ప్రభాస్, విజయదేవరకొండలతో పెళ్లి వార్తలపై నిహారిక స్పందన
- ప్రభాస్ ను ఇప్పటివరకు కలవలేదు
- విజయ్ తో మాట్లాడింది కూడా లేదు
- నిహారిక ఆవేదన
మెగా కుటుంబం నుంచి వచ్చిన తొలి హీరోయిన్ గా నాగబాబు కుమార్తె నిహారిక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ సూర్యకాంతం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఆ చిత్రానికి ప్రచారం కల్పించేందుకు నిహారిక అనేక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనపై వస్తున్న కథనాల పట్ల స్పందించింది. గతంలో ప్రభాస్ తో, ఇటీవల విజయ్ దేవరకొండతో తన పేరును జతచేసి పెళ్లంటూ ప్రచారం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది.
తన ప్రమేయం లేకుండానే తెరపైకి వచ్చిన ఆ పెళ్లి వార్తలు తనను ఎంతో బాధించాయని నిహారిక వెల్లడించింది. ప్రభాస్ ను తాను కలిసిందే లేదని, అయినా పుకార్లు పుట్టించారని, విజయ్ దేవరకొండతో ఏనాడూ మాట్లాడింది లేదని అయినా పెళ్లంటూ ప్రచారం చేస్తున్నారని వాపోయింది. తాను మెగా కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని కావడంతోనే గాసిప్స్ ఎక్కువగా వస్తున్నాయని పేర్కొంది. మిగతావాళ్ల గురించి రాస్తే ఎవరూ పట్టించుకోరు కాబట్టి తనను లక్ష్యంగా చేసుకుని పుకార్లు పుట్టిస్తున్నారని నిహారిక వివరించింది. తనపై ఒక వార్త రాగానే చిలవలుపలువలుగా మిగతా వార్తలు పుట్టుకొస్తున్నాయని తెలిపింది.