Chandrababu: ఈ అమ్మాయిని నేనే అమెరికా నుంచి రమ్మన్నాను: విజయవాడ రోడ్ షోలో చంద్రబాబు
- జలీల్ ఖాన్ కుమార్తె గురించి మాట్లాడిన బాబు
- ప్రజలకు అందుబాటులో ఉంటారంటూ హామీ
- గెలిపించాలని పిలుపు
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓవైపు గొంతు బొంగురుపోయినా అలాగే మాట్లాడుతూ సభలు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు. నేడు కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన తాజాగా విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి షబానా ఖాతూన్ గురించి ప్రస్తావించారు. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె అయిన షబానా ఖాతూన్ ను తానే అమెరికా నుంచి రప్పించానని చంద్రబాబు వెల్లడించారు.
ఉన్నత విద్యావంతులు, అభ్యుదయ భావాలు ఉన్నవాళ్లు ప్రజల కోసం పనిచేయాలన్నది తన అభిలాష అని, అందుకే ఆమెను ఎన్నికల్లో పోటీచేయాల్సిందిగా ప్రోత్సహించానని చంద్రబాబు తెలిపారు. ఆమె అమెరికాలో ఉంటుందని అపోహ పడవద్దని, ఇకమీదట పూర్తిస్థాయిలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే, షబానా మీద ప్రస్తుతం పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్థి గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేశారని, 'చూడండి ఎలా మ్యాచ్ అయిందో' అంటూ చమత్కరించారు. 'పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది కదూ తమ్ముళ్లూ?' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆ క్యాండిడేట్ ఒక పార్టీ అయితే, భర్త మరో పార్టీ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలది భార్యాభర్తల బంధం అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు, విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్థి 'పీవీపీ' వరప్రసాద్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ్నించి వచ్చాడీ ఎంపీ క్యాండిడేట్? ఏనాడైనా కనిపించాడా? అంటూ విమర్శించారు. హైదరాబాద్ లో ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ వాళ్లు పంపిస్తే వచ్చాడని ఆరోపించారు. కేశినేని నాని ఐదేళ్లు మనకోసం పోరాడిన వ్యక్తి అని, అతడిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. నానీని మళ్లీ పార్లమెంటుకు పంపిస్తే మన హక్కుల కోసం పోరాడతాడని పేర్కొన్నారు.