Jagan: పులివెందులలో జగన్ ను ఓడించడానికి చిన్నకుర్రాడు చాలు: కేఏ పాల్
- ప్రజాశాంతి తరఫున మంచి అభ్యర్థిని దింపాం
- జగన్ వద్ద లక్ష కోట్లున్నాయి
- మా వద్ద లక్ష రూపాయలే ఉన్నాయి
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మాటల పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్ తమ హెలికాప్టర్ గుర్తుచూసి భయపడుతున్నాడని, హెలికాప్టర్ కు ఫ్యాన్ కు తేడా తెలియని జగన్ సీఎం అయితే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని పాల్ కొన్నిరోజుల కిందటే భారీ సెటైర్ వేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, పులివెందులలో హెలికాప్టర్ గుర్తుపై ఓటు వేసి జగన్ ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. జగన్ ను పులివెందులలో ఓడించడానికి చిన్న కుర్రాడు సరిపోతాడని ధీమా వ్యక్తం చేశారు. అయితే, జగన్ వద్ద ప్రస్తుతం లక్ష కోట్లు ఉంటే తమ వద్ద లక్ష రూపాయలే ఉన్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ లకు ఓటు వేయొద్దని, వాళ్లు అవినీతిపరులని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న అన్ని పార్టీల్లో ప్రజాశాంతి ఒక్కటే అవినీతి రహిత పార్టీ అని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.