Andhra Pradesh: నేనొచ్చాక కూడా నాతో పోటీకి దిగుతారా.. కనీసం డిపాజిట్లు వస్తాయా?: రెచ్చిపోయిన కేఏ పాల్
- నన్ను పోటీ చేయొద్దన్నారు
- నర్సాపూర్ ను అమెరికా చేస్తా
- 10,000 అడుగుల రన్ వే నిర్మిస్తా
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో మాట్లాడారు. తన అనుచరులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పాల్, నర్సాపూర్ లో తనతో మెగాబ్రదర్ నాగబాబు ఏం మాట్లాడారో అందరికీ వివరించి చెప్పారు. నామినేషన్ సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నాగబాబు తనను చూసి లేచివచ్చి కరచాలనం చేశాడని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, "తమ్ముడా, నర్సాపూర్ లో నాకు వ్యతిరేకంగా ఎంపీగా పోటీచేస్తున్నావా? తప్పు తప్పు" అంటూ నాగబాబు తనతో అన్నారని పాల్ వెల్లడించారు. అందరూ వింటుండగానే నాగబాబు ఆ మాటలు అన్నాడని తెలిపారు.
"అయినా, నేనొచ్చాక ఎవరన్నా పోటీ చేయొచ్చా? చేస్తానంటే చెయ్యండి, కానీ డిపాజిట్లు రావు. నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపిస్తే నర్సాపూర్ లో 10,000 అడుగుల రన్ వేతో ఎయిర్ పోర్టు నిర్మిస్తా. నాకు రెండు 747 బోయింగ్ విమానాలున్నాయి. అవి రావాలంటే రన్ వే ఉండాలి కదా! ఒకే ఒక్క సంవత్సరంలోనే ఎయిర్ పోర్టు నిర్మిస్తా. ఆ విషయం చంద్రబాబునాయుడికి, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కు బాగా తెలుసు. అందుకే అంటుంటారు, "సార్ ఓ లక్ష కోట్లయినా ఇవ్వండి" అని. నా డబ్బులన్నీ సీజ్ చేసి మళ్లీ నన్నే లక్ష కోట్లు అడుగుతారు, నా దగ్గర లక్ష రూపాయల కూడా లేవు. సీక్రెట్ గా ఎక్కడో ఉన్నాయనుకుంటారు కానీ నీతినిజాయతీకి మారుపేరు కేఏ పాల్" అంటూ తన ప్రసంగం చేశారు.