YSRCP: నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పండి... వెంటనే వదిలిపెట్టండి: తల్లడిల్లుతున్న డ్రైవర్ ప్రసాద్ తల్లి
- ఫోన్ చేసి విషయం చెప్పాడు
- ఆ తర్వాత ఫోన్ ఎత్తలేదు
- ఎక్కడున్నాడో తెలియడం లేదని ఆందోళన
వైఎస్ వివేకా హత్య కేసులో అనూహ్యరీతిలో డ్రైవర్ పేరు తెరపైకి రావడంతో కేసు మరో మలుపు తిరిగింది. మొదట రాజారెడ్డి హత్యకేసు నిందితుడు సుధాకర్ రెడ్డిపై వివేకా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసినా, సాయంత్రానికి లేఖ తెరపైకి రావడంతో డ్రైవర్ పై అందరి దృష్టిపడింది. అయితే తన బిడ్డ హత్య చేసేంత కిరాతకుడు కాదని, వివేకా వద్ద చాలా నమ్మకంగా పనిచేసేవాడని డ్రైవర్ ప్రసాద్ తల్లి మీడియాకు వివరించింది. శుక్రవారం ఫోన్ చేసి సార్ చనిపోయాడమ్మా అంటూ వివేకానందరెడ్డి మరణవార్త చెప్పి ఫోన్ పెట్టేశాడని, ఆ తర్వాత తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదని తెలిపింది. తన బిడ్డ ఎక్కడున్నాడో చెప్పాలని, వెంటనే వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేసింది.
లేఖలో తన బిడ్డ పేరు వచ్చిందని తెలిసిన తర్వాత ఎంతో ఆందోళనకు గురయ్యానని, తన కుమారుడు అంత ఘోరం చేశాడంటే తాము నమ్మబోమని స్పష్టం చేసింది. రెండేళ్లుగా వివేకానందరెడ్డి దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడని, ఇలాంటి సమయంలో తన బిడ్డ యజమానినే హత్య చేశాడంటే నమ్మశక్యం కావడంలేదని పేర్కొంది. గతంలో వివేకానందరెడ్డి.. ప్రసాద్ సోదరుడి పెళ్లికి కూడా ఆర్థికసాయం చేశారని వెల్లడించింది. అలాంటి మంచి వ్యక్తిని తన కుమారుడు ఎందుకు చంపుతాడంటూ ప్రశ్నించింది డ్రైవర్ ప్రసాద్ తల్లి.