Andhra Pradesh: జగన్ హైదరాబాద్ లో దర్జాగా, సంతోషంగా ఉంటున్నాడు.. ఎందుకంటే..!: ఏపీ సీఎం చంద్రబాబు
- ఆయన్ను అక్కడి ప్రభుత్వం ఎప్పటివరకైనా కాపాడుతుంది
- కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నాయి
- మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ తో దర్జాగా, సంతోషంగా ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎందుకంటే తెలంగాణలో ఆయన ప్రభుత్వమే అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు. జగన్ కు అక్కడి ప్రభుత్వం ఎప్పటివరకైనా రక్షణ కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. ‘కేసుల నుంచి రక్షణ ఉంది. దర్జాగా ఉంటున్నాడు. హ్యాపీగా ఉంటున్నాడు. ఎలాంటి సమస్య లేదు’ అని పేర్కొన్నారు. ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ వ్యవహారంలో ఈరోజు అమరావతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాలపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ‘తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు.. రెండూ ఆర్థిక టెర్రరిస్టులుగా పనిచేస్తున్నాయి. టీడీపీ నేతలను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. లీడర్ షిప్ ను కిల్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మనుషులపై దాడిచేయడం, కేసులు పెట్టడం, వేధించడం, 24 గంటలు దృష్టి మళ్లించడం వంటి పనులు చేస్తున్నారు.
రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీలను వేధిస్తారా? టీడీపీ తరఫున పోటీ చేస్తానంటే ఈడీ వస్తుంది ఐటీ వస్తుందని బెదిరిస్తారా? వైసీపీలోకి వెళ్లి చేరాలని సూచిస్తారా? ఎవరు ఏం చేసినా భయపడేది లేదు. టీడీపీకి సానుకూలంగా మాట్లాడినా తట్టుకోలేకపోతున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.