Chandrababu: దమ్ముంటే కాణిపాకం వినాయకుడి సాక్షిగా ప్రమాణం చేయగలవా?: చంద్రబాబుకు కన్నా సవాల్
- అవినీతికి పాల్పడే నువ్వా మాట్లాడేది?
- మోదీని విమర్శించే స్థాయి నీకెక్కడుంది?
- నిప్పులు చెరిగిన రాష్ట్ర బీజేపీ చీఫ్
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన భారీ బహిరంగ సభలో కన్నా మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో మతి భ్రమించిన చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదని అన్నారు.
గతంలో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఆ తర్వాత మాటమార్చారని కన్నా ఆరోపించారు. దమ్ముంటే కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేసి తాను ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోలేదని చెప్పాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. అయినా, నిత్యం అవినీతితో సావాసం చేసే చంద్రబాబుకు ప్రధాని మోదీని విమర్శించే స్థాయిలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతుంటే, మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారని దుష్ప్రచారం చేయడం చంద్రబాబుకే చెల్లిందని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ మోదీని హీరోగా కీర్తిస్తున్నాయని, ఆయన దౌత్య నీతిని వేనోళ్ల పొగుడుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రం పాకిస్థాన్ ప్రధాని మాట్లాడిన మాటలు పలుకుతున్నారని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్నది దేశద్రోహ నేరం కాదా? అని ప్రశ్నించారు కన్నా. ముఖ్యమంత్రి కాదు కదా కనీసం కార్పొరేటర్ కి కూడా పనికిరాని చంద్రబాబును 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏపీ ప్రజలు ఓడిస్తారని జోస్యం చెప్పారు.