Police: సైబర్ క్రైమ్ కేసులతో ఆటాడుకునే లేడీ పోలీసాఫీసర్ కు అందాలరాణి కిరీటం

  • మిస్ జర్మనీ టైటిల్ గెలుచుకున్న నాడీనే బెర్నీస్
  • 15 మందితో పోటీ పడి విజేతగా నిలిచిన వైనం
  • ప్రజలే న్యాయనిర్ణేతలు

పోలీసు అధికారులంటే నిలువునా కాఠిన్యం నిండిన వాళ్లుగా భావించడంలో ఆశ్చర్యంలేదు. వాళ్ల వృత్తికి అది అవసరం కూడా! సున్నిత శరీరులుగా భావించే అతివలు కూడా నేడు పోలీసు అధికారులుగా రాణిస్తున్నారు. మహిళలైనా కొన్ని సందర్భాల్లో పురుషులకు దీటుగా క్రిమినల్ కేసులను సైతం చాకచక్యంగా పరిష్కరిస్తున్నారు.

అలాంటి లేడీ పోలీసాఫీసర్లలో అక్కడక్కడ గొప్ప సౌందర్యరాశులు కూడా ఉంటారు. జర్మనీ దేశానికి చెందిన నాడీనే బెర్నీస్ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఆమె వృత్తిరీత్యా ఓ పోలీసు అధికారిణి. సైబర్ క్రేమ్ కేసుల దర్యాప్తులో అందెవేసిన చేయి అని పోలీస్ డిపార్ట్ మెంట్ లో బెర్నీస్ గురించి చెప్పుకుంటారు. అంతజేసీ ఆమె వయసు 28 ఏళ్లే. ఈ లేడీ కాప్ ఇప్పుడు మిస్ జర్మనీ అందాలపోటీల్లో విజేతగా నిలిచింది.

తన స్వస్థలం అయిన బాడెన్-ఉర్టెమ్ బర్గ్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన బెర్నీస్ ఈ పోటీల్లో 15 మందితో పోటీపడి ప్రథమ స్థానం దక్కించుకుంది. ద్వితీయ స్థానంలో హాంబర్గ్ కు చెందిన ప్రిసిల్లా క్లీన్ (23), తృతీయ స్థానంలో 22 ఏళ్ల అనస్తాసియా అక్సాక్ నిలిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారిలో అత్యధిక వయస్కురాలు బెర్నీసే.

మిస్ జర్మనీగా గెలవడంతో ఆమె తన పోలీస్ ఉద్యోగానికి ఏడాది పాటు సెలవు పెట్టింది. బ్యూటీ క్వీన్ గా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో లాంగ్ లీవ్ పెట్టిందీ జర్మన్ సొగసరి. మిస్ జర్మనీ పోటీలు జర్మనీలో చాలాకాలం నుంచి జరుగుతున్నాయి. మొదటిసారిగా 1927లో అందాల పోటీలు నిర్వహించారు. విశేషం ఏంటంటే ప్రజలే ఈ పోటీలకు న్యాయనిర్ణేతలు. వారి అభిప్రాయం ప్రకారమే విజేతను నిర్ణయిస్తారు.

  • Loading...

More Telugu News