Andhra Pradesh: 3.7 కోట్ల మంది ఓటర్ల డేటాను దుర్వినియోగం చేసిన టీడీపీ యాప్?.. వైసీపీ ఫిర్యాదుతో దర్యాప్తు మొదలు!

  • ఓటర్ల పూర్తి వివరాలు యాప్ లో ప్రత్యక్షం!
  • విజయసాయిరెడ్డి ఫిర్యాదు స్వీకరణ
  • దర్యాప్తు ప్రారంభించిన యూఐడీఏఐ, ఈసీ, సైబర్ పోలీస్

మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో వైసీపీ నేతలు అధికార టీడీపీపై తీవ్రస్థాయి ఆరోపణలకు తెరలేపారు. టీడీపీ యాప్ లో 3.7 కోట్ల మంది ఓటర్ల వివరాలు ఎలా వచ్చాయో చెప్పాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేయడమే కాదు, దీనిపై సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేశారు. ఆయన తన ఫిర్యాదులో ఐటీ గ్రిడ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన టీడీపీ సేవామిత్ర యాప్ లో ఓటర్ల జాబితా మొదలుకుని వ్యక్తిగత వివరాల వరకు అన్నీ బహిర్గతం అయ్యాయని ఆరోపించారు.

అధికార పక్షం ఈ యాప్ సాయంతో అవకతవకలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. ఎన్నికల సంఘం రూపొందించిన డేటాను సేవామిత్ర యాప్ సాయంతో టీడీపీ దుర్వినియోగం చేస్తోందని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విజయసాయి. వైసీపీ ఎంపీ ఫిర్యాదు మేరకు ఆధార్ సంస్థతో పాటు ఎన్నికల కమిషన్, సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దీని గురించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ... డేటా దుర్వినియోగం ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉందన్నారు. కోట్ల మంది ఓటర్ల వివరాలు ఐటీ గ్రిడ్స్ ఇండియా సంస్థకు ఎలా దక్కాయో తమ దర్యాప్తులో తెలుసుకుంటామని తెలిపారు. కాగా, టీడీపీ యాప్ లో ఓటర్ల ఐడీ నంబర్లు, పేర్లు, కలర్ ఫొటోలు, బూత్ స్థాయి సమాచారం, కుటుంబ వివరాలు, కులం సమాచారం, ఓటరు ఏవైనా ప్రభుత్వ పథకాల లబ్దిదారుడా? అనే వివరాలన్నీ ఉన్నట్టు సమాచారం!

  • Loading...

More Telugu News