Tollywood: దివ్యభారతి చివరిక్షణాల్లో ఏం జరిగింది?.. ఆమె ఎవరితో కలిసి మద్యం తాగిందో తెలుసా?
- మరణానికి కాసేపటి ముందు మందు పార్టీ
- 19 ఏళ్లకే నూరేళ్లు నిండిన టాలెంటెడ్ హీరోయిన్
- జాతీయ మీడియాలో ఆసక్తికర కథనం
తెలుగులో బొబ్బిలిరాజా, రౌడీ అల్లుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో దివ్యభారతి నటనను ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. కళ్లు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ వరకు తన సౌందర్యం, అభినయంతో అలరించిన ప్రతిభావంతురాలైన నటి దివ్యభారతి. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు 19 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయి.
తన నివాసంలో బాల్కనీ నుంచి పడిపోయి మరణించింది దివ్యభారతి. ఆమె మరణంపై ఆ సమయంలో వచ్చినన్ని కథనాలు మరే తార విషయంలోనూ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఓ దశలో భర్త సాజిద్ నడియడ్ వాలాను అనుమానిస్తూ లెక్కలేనన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. చాలామందికి దివ్యభారతి మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగా మిగిలిపోయింది. అయితే ఫిబ్రవరి 25న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓ జాతీయ మీడియా సంస్థ ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. దివ్యభారతి చివరిక్షణాల్లో అసలేం జరిగిందో వివరంగా పేర్కొంది.
చెన్నైలో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న దివ్యభారతి ముంబయి చేరుకుంది. మరో సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉన్నా వేరే కారణాల రీత్యా ఆ షూటింగ్ రద్దు చేసుకుంది. అనంతరం తన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా, ఆమె భర్త శ్యామ్ లను తన ఇంటికి విందుకు ఆహ్వానించింది. నీతా భర్త శ్యామ్ ఓ సైకియాట్రిస్ట్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో తరచుగా అందరూ కలిసి పార్టీలు జరుపుకోవడం సాధారణమైన విషయం. ఈ పర్యాయం కూడా మందు పార్టీ చేసుకున్నారు.
ఇంట్లో కుక్ అతిథుల కోసం వంటకాలు సిద్ధం చేస్తుండగా... దివ్యభారతి బాల్కనీ గోడపై కూర్చుంది. ఆ సమయంలో నీతా, శ్యామ్ టీవీ చూస్తున్నారు. అప్పటికే అందరూ మద్యం సేవించి ఉన్నారు. అయితే బాల్కనీలో కూర్చున్న దివ్యభారతి ఇటు తిరిగే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడిపోయింది. ఐదో అంతస్తు నుంచి పడిపోవడంతో తలకు బలమైన దెబ్బలు తగిలాయి. అప్పటికి ఆమె ప్రాణం పోలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్చినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది దివ్యభారతి. ఇదీ.. ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనం ప్రకారం దివ్యభారతి చివరిక్షణాలు.
దీనిపై దివ్యభారతి తండ్రి ఓంభారతి కూడా తన అభిప్రాయాలు వెల్లడించారు. తన కుమార్తె మద్యం మత్తులో పడిపోయిందని చెప్పలేనని, ఒక అరగంటలో ఎంత తాగుతాం చెప్పండి? అంటూ ప్రశ్నించారు. తనకు ఎవరిమీదా అనుమానం లేదని, ఆమెది సూసైడ్ కాదు, మర్డర్ కూడా కాదు.. దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యభారతికి ఎలాంటి సమస్యలు లేవని, ప్రమాదవశాత్తు మరణించిందనే భావిస్తున్నామని తెలిపారు.
ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే... దివ్యభారతి నివసించే అపార్ట్ మెంట్ లో అన్ని ఫ్లాట్లకు బాల్కనీలో గ్రిల్స్ ఉంటాయి. కానీ దివ్యభారతి ఇంటికి మాత్రం గ్రిల్స్ లేకుండా ఓపెన్ బాల్కనీలు ఉన్నాయి. అంతేకాదు, ఆమె ఫ్లాట్ కిందనే కార్ పార్కింగ్ బయటి వరకు ఉంటుంది. రోజు ఐదారుకార్లు అక్కడ పార్కింగ్ చేస్తారు. కానీ, అదేం విచిత్రమో కానీ ఆ రోజు మాత్రం ఒక్క కారు కూడా పార్క్ చేయలేదు. బాల్కనీ లోంచి నేరుగా ఫ్లోర్ పై పడిపోయి గట్టి దెబ్బలు తగలడంతో మృత్యువాత పడింది.