rasmo: మేనత్త కిరాతకం .. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి!
- తమ్ముడి ఇంటికి వచ్చిన అక్క
- తిరిగి వెళ్లమన్న మరదలు
- కోపానికి చిన్నారి ప్రాణాలు బలి
కోపం .. ద్వేషం వివేకాన్ని పూర్తిగా విడిచిపెట్టేలా చేస్తాయి .. ఎంతటి దారుణానికైనా పాల్పడేలా చేస్తాయి. క్షణాల్లో తీసుకునే నిర్ణయాలు కొన్ని ప్రాణాలను గాల్లో కలిపేస్తుంటాయి .. నేరస్తులుగా మార్చేస్తుంటాయి. అలాంటి సంఘటనే ఒకటి విశాఖ - మన్యంలో చోటు చేసుకుంది.
విశాఖ .. మన్యం ప్రాంతంలోని 'పెదబయలు' మండలం పరిథిలోని 'లకేయుపుట్టు'లో నివసిస్తోన్న ఓ దంపతుల ఇంటికి, లక్ష్మీపేట పంచాయతీ .. 'కప్పాడు' గ్రామం నుంచి రస్మో అనే యువతి వచ్చింది. ఈ యువతికి ఆ దంపతులు తమ్ముడు - మరదలు వరస అవుతారు. నెల రోజులుగా రస్మో అక్కడే వుండి పోవడంతో, భారంగా భావించిన మరదలు ..ఇక తిరిగి బయలుదేరమని చెప్పింది.
దాంతో కోపంతో రగిలిపోయిన రస్మో .. కట్టెలకోసమని చెప్పి తమ్ముడి కూతురును వెంటబెట్టుకుని వెళ్లి కత్తితో కడతేర్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు రస్మోను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులు కేసు నమోదు చేసి .. దర్యాప్తు చేస్తున్నారు.