: జట్టును చూసి కెప్టెన్ ను చూడమన్నారు: గంభీర్
టీమిండియా నుంచి అన్ని ఫార్మాట్లలోనూ ఉద్వాసనకు గురైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్ తాజాగా ఓ టీవీ చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో కెప్టెన్సీపై అభిప్రాయాలను పంచుకున్నాడు. నాయకత్వం అనేది హోదా కాదని, అదో బాధ్యత అని చెప్పుకొచ్చాడు. ఓ జట్టు గెలుస్తోందంటే, అది కెప్టెన్ ఘనత కాదని, అందులో సభ్యులందరి సమష్టి కృషి ఉంటుందని ఈ డాషింగ్ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. అందుకే జట్టును చూసి కెప్టెన్ ను చూడాలని భాష్యం చెప్పాడు. ఉదాహరణగా రికీ పాంటింగ్ ను పేర్కొన్నాడు.
ఓ దశ వరకు ఆసీస్ జట్టు జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగిందన్న గంభీర్, అందుకు కారణం జట్టులో ఉన్న ఉద్ధండులైన ఆటగాళ్ళే అని చెప్పాడు. ఆ సమయంలో షేన్ వార్న్, మాథ్యూ హేడెన్, ఆడమ్ గిల్ క్రిస్ట్, జస్టిన్ లాంగర్, గ్లెన్ మెక్ గ్రాత్, జాసన్ గిలెస్పీ వంటి మ్యాచ్ విన్నర్లు ఆసీస్ జట్టులో ఉండబట్టే.. కెప్టెన్ గా రికీ పాంటింగ్ ప్రస్థానం నల్లేరుపై నడక అయిందని వివరించాడు. ఇక వీరందరూ దాదాపు ఒకే సమయంలో క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో పాంటింగ్ కష్టాలు మొదలయ్యాయని గుర్తు చేశాడు.