Telangana: ఆ ఖర్మ మాకు పట్టలేదు.. అదంతా చంద్రబాబు కుట్ర!: కేటీఆర్
- కార్పొరేటర్‌ను గెలిపించుకోలేని పార్టీతో అవగాహనా?
- ముందస్తు ఎన్నికలతో మోదీకి ఏం సంబంధం?
- ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన కేటీఆర్
బీజేపీతో రహస్య అవగాహన ఉందనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని టీఆర్ఎస్ నేత కేటీఆర్ తేల్చి చెప్పారు. అంత ఖర్మ తమకు పట్టలేదన్నారు. గత ఎన్నికల్లో కేవలం ఐదు అసెంబ్లీ స్థానాల్లోనే బీజేపీ విజయం సాధించిందని, కానీ ఒక్క కార్పొరేటర్‌నూ గెలిపించుకోలేకపోయిన దుస్థితిలో ఉన్న ఆ పార్టీతో తమకు రహస్య అవగాహన ఏంటని ప్రశ్నించారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీతో తమకు ఎటువంటి అవగాహన, పొత్తు, సంబంధం లేవన్నారు. ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబు కుట్రేనని, బీజేపీతో తమకు సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలతో మోదీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. అసలు బీజేపీతో అవగాహన కుదుర్చుకోవాలన్న ఆలోచనే తమకు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.