BJP: శివాజీకి పిచ్చి పట్టింది.. అందుకే బాబు డైరెక్షన్ లో విమర్శలు చేస్తున్నారు!: బీజేపీ నేత కృష్ణ
- గతంలోచేసిన ఆరోపణలు ఏమయ్యాయి
- బీజేపీపై దాడికి ఎన్టీఆర్ భవన్ వేదిక
- కాంగ్రెస్ పొత్తుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది
‘ఆపరేషన్ గరుడ’ పేరుతో నటుడు శివాజీ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ విమర్శించారు. టీడీపీ-కాంగ్రెస్ అపవిత్ర పొత్తు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కొత్త నాటకానికి తెరదీశారని ఆరోపించారు. శివాజీతో చంద్రబాబు నాయుడే ఈ మాటలు చెప్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఐదు నెలల క్రితం శివాజీ ఇదే విషయమై మాట్లాడారనీ, అందులో ఒక్కటి కూడా నిజం ఉందా? అని ప్రశ్నించారు. ఈ రోజు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సాయి కృష్ణ మాట్లాడారు.
చంద్రబాబు డైరెక్షన్ లో శివాజీ పిచ్చివాడిలా మాట్లాడుతున్నారని సాయి కృష్ణ విమర్శించారు. బీజేపీపై తప్పుడు ప్రచారానికి ఎన్టీఆర్ భవన్ వేదికగా మారిందని దుయ్యబట్టారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో సోనియా గాంధీని దెయ్యమని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఆమెకే చెందిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందనీ, ఆ పార్టీకి ఓటేయొద్దని బాబు చెప్పడాన్ని ఏపీ ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు.