Chandrababu: చంద్రబాబు గజానికో కబ్జాకోరును తయారు చేశారు: వైఎస్ జగన్
- విశాఖ భూములపై చంద్రబాబు కన్ను పడింది
- పెదబాబు పర్మిషన్ ఇస్తే చినబాబు కమిషన్ వసూలు
- భూదందాల నాయకులకు చంద్రబాబు, లోకేశ్ ల అండ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గజానికో కబ్జాకోరును తయారు చేశారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. విశాఖపట్టణం జిల్లాలోని సబ్బవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, విశాఖ భూములపై చంద్రబాబు కన్ను పడిందని, అక్రమాలకు పెదబాబు పర్మిషన్ ఇస్తే చినబాబు కమిషన్ వసూలు చేసుకుంటాడని ఆరోపించారు.
రికార్డులు తారుమారు చేసి పెందుర్తిలో పేదవాడి అసైన్డ్ భూములను లాక్కున్నారని, అమ్మకానికి వీలులేని అసైన్డ్ భూములను చంద్రబాబు తన బినామీలతో తక్కువ ధరకే కొనుగోలు చేయించారని ఆరోపించారు. భూదందాలు చేస్తున్న టీడీపీ నాయకులకు చంద్రబాబు, లోకేశ్ ల అండదండలు దండిగా ఉన్నాయని, ఏపీలో జరిగిన అన్ని స్కాముల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పెదబాబు, చినబాబుల పాత్ర ఉందని ఆరోపించారు.