Chandrababu: చంద్రబాబు హయాంలో ‘పోలవరం’ పూర్తవుతుందనే నమ్మకం లేదు: వైఎస్ జగన్
- పోలవరం ప్రాజెక్టును అవినీతిమయం చేశారు
- మంత్రి యనమల బంధువుకు కాంట్రాక్ట్ ఇచ్చారు
- చంద్రబాబు అవినీతి వల్ల నత్తనడకన పోలవరం పనులు
ఏపీ సీఎం చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం తనకు లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణం జిల్లాలోని కె.కోటపాడులో జరుగుతున్న బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును అవినీతిమయం చేశారని, మంత్రి యనమల బంధువుకు ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇచ్చారని, దోచుకుతింటున్నారని ఆరోపించారు.
చంద్రబాబు అవినీతి కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని, వచ్చే ఎన్నికలలో తాము గెలిచి అధికారంలోకి రాగానే ‘పోలవరం’ను పూర్తి చేస్తామని, రైవాడ రిజర్వాయర్ నీటిని అందిస్తామని అన్నారు. చెట్టు-నీరు పేరిట తాటిచెట్టు లోతులో మట్టిని తవ్వి, ఆ మట్టిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. తప్పుడు పనులన్నీ చేసేది చంద్రబాబు.. ఆ నెపాలన్నింటినీ వేరే వారిపై నెట్టేస్తారని ఆరోపించారు. చంద్రబాబుకు తోడు నలుగురు మంత్రులు, ఎల్లో మీడియా వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.