Andhra Pradesh: హై ఇంపాక్ట్ ప్రయారిటీ ప్రాజెక్టులను నిర్దిష్ట గడువు ప్రకారం పూర్తి చేయాలి: ఏపీ సీఎస్

  • హై ఇంపాక్ట్ ప్రయారిటీ ప్రాజెక్టులపై సమీక్ష
  • ప్రతి ప్రాజెక్టుకు ఒక నిర్ణీత గడువు విధించాలి
  • ఆ గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి

ఏపీలో అత్యంత ప్రభావిత, ప్రాధాన్యత కలిగినవిగా గుర్తించిన ప్రాజెక్టులకు నిర్దిష్ట గడువు విధించి వాటిని సకాలంలో పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. ఈమేరకు అమరావతి సచివాలయంలో అత్యంత ప్రభావిత, ప్రాధాన్యత ప్రాజెక్టుల (హై ఇంపాక్ట్ ప్రయారిటీ ప్రాజెక్ట్స్) పై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.

ఈ విధంగా గుర్తించిన ప్రతి ప్రాజెక్టుకు ఒక నిర్ణీత గడువు విధించి ఆ గడువులోగా సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేగాక ఆయా ప్రాజెక్టుల ప్రగతిపై ఎప్పటికప్పుడు వివరాలు అందజేయాలని, పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. గత సమావేశం నుండి ఇప్పటి వరకూ ఈప్రాజెక్టుల పురోగతిలో అనుకున్నంత ప్రగతి లేదని, హై ఇంపాక్ట్ అండ్ ప్రయారిటీ ప్రాజెక్టులను వేగవంతంగా చేపట్టి సకాలంలో పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉందని దినేష్ కుమార్ అధికారులకు స్పష్టం చేశారు.

ముఖ్యంగా హై ఇంపాక్ట్, ప్రయారిటీ ప్రాజెక్టులుగా గుర్తించిన ఎకనమిక్ సిటీలు, జక్కంపూడి ఎకనమిక్ సిటీ, అమరావతి - అనంతపురం ఎక్స్ ప్రెస్ రహదారి, బీచ్ కారిడార్, విశాఖపట్నం - చెన్నె ఇండస్ట్రియల్ కారిడార్, ఎంఎస్ఎంఇ క్లస్టర్ల అభివృద్ధి, విశాఖపట్నంలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రాజెక్టులపై దినేష్ కుమార్ సమీక్షించారు. అలాగే, ప్రమోషన్ ఆప్ స్టార్టప్ ఇకోసిస్టమ్, విశాఖపట్నంలో ప్రమోషన్ ఆఫ్ ఫిన్టెక్ వ్యాలీ, ఏవీజీసీ ఫిల్మ్ అండ్ మీడియా సిటీ, కోల్డు చైన్ కార్పొరేషన్ ఏర్పాటు, మైక్రో ఇరిగేషన్ కింద సాగు విస్తీర్ణత పెంపొందించడం, ఇకో-టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి, ఉన్నత విద్యకు సంబంధించి ఐఐటి, ఎన్ఐటి, ఐఐయం, కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాలు తదితర ఏడు ప్రాధాన్యత ప్రాజెక్టులపై దినేష్ కుమార్ సమీక్షించారు.

అదేవిధంగా గత నాలుగేళ్లుగా నిర్వహించిన పార్టనర్ షిస్ సమిట్స్, ఇతర సందర్భాల్లోను వివిధ కంపెనీలు, సంస్థలతో చేసుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంఓయులు) అన్నిటినీ పూర్తిగా కార్యాచరణలోకి తీసుకువచ్చేందుకు ఆయా శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

అంతకుముందు, ప్రణాళికాశాఖ కార్యదర్శి సంజయ్ గుప్త హై ఇంపాక్ట్ ప్రయారిటీ ప్రాజెక్టులు వాటి ప్రగతి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు వారి వారి శాఖలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రగతిని వివరించారు.  

  • Loading...

More Telugu News