Chandrababu: వరదల వల్ల ఉభయగోదావరి జిల్లాల్లో రూ.600 కోట్ల నష్టం జరిగింది: సీఎం చంద్రబాబు

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు విహంగవీక్షణం
  • ప్రత్యామ్నాయ పంటలకు పరిహారం చెల్లిస్తాం
  • హెక్టార్ కు రూ.25 వేలు నష్టపరిహారం అందిస్తాం

ఏపీలో 2006 తర్వాత ఇప్పుడు పెద్ద వరదలు వచ్చాయని, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన విహంగవీక్షణం చేసి, జిల్లాల్లో జరిగిన నష్టంపై అంచనా వేశారు. అనంతరం, రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అధికారులతో ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఉభయగోదావరి జిల్లాల్లో రూ.600 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన పరిహారం చెల్లిస్తామని, హెక్టార్ కు రూ.25 వేలు నష్టపరిహారంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలోని 19 మండలాల్లో 45 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని, బాధితుల కోసం 16 పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయని చెప్పారు.

6,600 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాలువ వల్ల ఎక్కువ నష్టం వాటిల్లిందని, ఎర్ర కాలువ ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తామని అన్నారు. కాజ్ వేల పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తున్నామని, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

‘పోలవరం’కు  కేంద్రం నుంచి రూ.2,600 కోట్లు రావాల్సి ఉంది

పోలవరం ప్రాజెక్టు పనులు 57.5 శాతం పూర్తయ్యాయని, వచ్చే ఏడాది మే నాటికి మొత్తం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిమిత్తం కేంద్రం నుంచి రూ.2,600 కోట్లు రావాల్సి ఉందని, ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం తీసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో 57 ప్రాధాన్య ప్రాజెక్టులు చేపట్టామని, ఇప్పటివరకూ 16 ప్రాజెక్టులు పూర్తయినట్టు చెప్పారు. ఆర్ అండ్ బి రహదారులకు రూ.35 కోట్లు కేటాయిస్తామని, రాయలసీమలో కరవు ఉందని, కోస్తాలో వరదలు వచ్చాయని, ఆరు జిల్లాల్లో కరవు నెలకొని ఉందని చంద్రబాబు తెలిపారు.

  • Loading...

More Telugu News