Chandrababu: అభివృద్ధికి అడ్డొస్తే.. తొక్కుకుంటూ ముందుకుపోతా: హెచ్చరించిన చంద్రబాబు
- రాష్ట్రాన్ని దివాలా తీయించాలన్నది వైసీపీ పథకం
- రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలననే నన్ను ఎన్నుకున్నారు
- వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం చారిత్రక అవసరం
రాష్ట్రాభివృద్ధికి ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ ముందుకుపోతానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. 1500 రోజుల ప్రభుత్వ పాలన పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమన్న చంద్రబాబు.. ఓటును ఆయుధంగా ఉపయోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ పాటుపడుతుంటే, దివాలా తీయించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
1930లో ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటే రాజ్యాంగాన్ని సవరించి మరీ రూజ్‌వెల్ట్‌ను అమెరికన్లు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, సంక్షోభంలో ఆయనైతేనే దేశానికి అవసరమన్న నమ్మకంతోనే ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్రాన్ని తానైతేనే చక్కదిద్దగలననే నమ్మకంతోనే ప్రజలు తనను ఎన్నుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.