Jagan: జగన్ పాదయాత్రను దెబ్బతీయాలని చంద్రబాబు చూశారు: అంబటి రాంబాబు
- జగన్ పాదయాత్రను ఓ పథకం ప్రకారం అడ్డుకోవాలని చూశారు
- జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి బాబుకు నిద్ర పట్టడం లేదు
- ఊహించని విధంగా పాదయాత్ర విజయవంతమైంది
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను దెబ్బతీయాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ప్రజాసంకల్ప యాత్ర విజయం సాధించకుండా ఓ పథకం ప్రకారం అడ్డుకోవాలని చంద్రబాబు చూశారని, అయితే, ఊహించని విధంగా తమ పాదయాత్ర విజయవంతమై.. ముందుకు సాగుతోందని అన్నారు.
జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని, బడుగు, బలహీనవర్గాల ప్రజలు జగన్ తో కలిసి నడుస్తున్నారని అన్నారు. పాదయాత్ర అంటే వైఎస్ కుటుంబమే గుర్తొస్తుందని, జగన్ తన పాదయాత్రను ఎంతో సాహసోపేతంగా ప్రారంభించారని, రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడేలా ఈ పాదయాత్ర సాగుతోందని చెప్పుకొచ్చారు.