Andhra Pradesh: ఏపీ రవాణా శాఖలో అవినీతి లేదని గర్వంగా చెబుతున్నా: మంత్రి అచ్చెన్నాయుడు

  • గుంటూరు జిల్లాలోని మందడంలో ‘మీ ముంగిట్లో రవాణా శాఖ’
  • పోలీస్ సహకారం, ప్రజా భాగస్వామ్యంతో ప్రమాదాలు తగ్గిస్తాం
  • ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే

ఏపీలోని రవాణా శాఖలో అవినీతి లేదని తాను గర్వంగా చెబుతున్నానని, ప్రజలకు కావలసిన అన్ని పనులు ఆన్ లైన్ లో చేయడం ద్వారా రవాణా శాఖలో అవినీతిని పూర్తిగా రూపుమాపినట్లు రవాణా, బీసీ సంక్షేమ, చేనేత శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని మందడంలో ‘మీ ముంగిట్లో రవాణా శాఖ’ కార్యక్రమంలో భాగంగా ఎల్ఎల్ఆర్ (లెర్నింగ్ లైసెన్స్) మేళా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రవాణా శాఖలో అవినీతిని రూపుమాపేందుకు పాటుపడ్డ అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు చెప్పారు. ప్రజల వద్దకు పరిపాలనను తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని, జన్మభూమి వంటి అనేక కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టారని చెప్పారు. గతంలో ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ప్రజలు నానా అవస్థలు పడేవారని, బ్రోకర్లు, లంచాలు, రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఉండేవని చెప్పారు. ఇప్పుడు ప్రజల ముంగిట్లోకే రవాణా శాఖ వచ్చి లైసెన్సులు అందజేస్తుందని చెప్పారు.

గ్రామాలలో వాహనాలు నడిపేవారందరికీ డ్రైవింగ్ వచ్చని, అయితే వారు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లడానికి భయపడి లైసెన్సులు తీసుకోరని అన్నారు. ఇప్పుడు అన్నీ ఆన్ లైన్ చేయడం ద్వారా అవినీతిని పూర్తిగా నిర్మూలించినట్టు చెప్పారు. తొలి దశలో కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు ఇచ్చినట్లు తెలిపారు. రెండో దశలో గ్రామాల్లోకి వెళ్లి టెస్ట్ లు పెట్టి ఎల్ఎల్ఆర్ లు అందజేస్తున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎల్ఎల్ఆర్ అందజేయడం తమ లక్ష్యమని, రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రజలలో చైతన్య కలిగిస్తున్నట్లు చెప్పారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అన్ని జిల్లాల్లో కమిటీలను నియమించామని, ఆ కమిటీ ప్రమాదాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకుంటుందని వివరించారు. కలెక్టర్లు శ్రమ, ఒత్తిడితో ఉన్నప్పటికీ ఈ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ప్రమాదాలు మైనస్ 11 శాతానికి తగ్గాయని, మైనస్ 50 శాతం తగ్గించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

పోలీసుల సహకారం, ప్రజా భాగస్వామ్యంతో ప్రమాదాలు తగ్గిస్తామని, తాము చేపట్టిన అన్ని చర్యలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని, ఆటోలకు కూడా లైఫ్ టాక్స్ ప్రవేశపెడతామని, త్వరలోనే దీనికి సంబంధించిన జీవో విడుదలకానున్నట్టు చెప్పారు. 3 నెలల్లో లక్ష లైసెన్సులు

‘మీ ముంగిట్లో రవాణ శాఖ’ కార్యక్రమం ద్వారా 3 నెలల్లో లక్ష మందికి ఎల్ఎల్ఆర్ లు అందజేసినట్లు రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. గతంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి సుదీర్ఘ ప్రక్రియ ఉండేదని, దీంతో చాలా మంది డ్రైవింగ్ చేయగల సామర్ధ్యం ఉన్నా లైసెన్స్ తీసుకునేవారు కాదని చెప్పారు. దాదాపు 33 శాతం మంది లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలినట్లు చెప్పారు. సర్పంచులు, ఎంపీటీలకు కూడా లైసెన్సులు లేవని, దాంతో మంత్రి ఆదేశాల ప్రకారం గ్రామాలకు వెళ్లి లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ పరికరాల కొనుగోలుకు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం రూ.10 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు.  

స్పీడ్ గన్లు, శ్వాసను పరీక్షించే పరికరాలను, వాహనాలను పైకి ఎత్తే క్రేన్స్ ను  కొనుగోలు చేసినట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. స్పీడ్ గన్లను మన దేశంలో ఎక్కడా వాడటంలేదని, మన రాష్ట్రంలోనే మొదటిసారిగా వాడనున్నట్లు, వాటిని ఆస్ట్రేలియా, అమెరికాలలో వాడతారని వివరించారు. ఒక్కో స్పీడ్ గన్ ఖరీదు రూ.6 లక్షలని, ఈ గన్ ద్వారా ఎదురుగా వచ్చే వాహనం ఎంత వేగంగా వస్తుందో తెలుసుకోవచ్చని చెప్పారు. మొత్తం 49 స్పీడ్ గన్లు, 420 శ్వాస పరీక్ష పరికరాలు, 13 టోవింగ్ వాహనాలను కొనుగోలు చేసినట్లు వివరించారు. వాటిని పోలీస్, రవాణ శాఖల వారికి అందజేస్తామని చెప్పారు.  మోటార్ సైకిళ్ల కారణంగానే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు 

రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా మోటార్ సైకిల్ వాహనాల వల్లే జరుగుతున్నాయని
విజయవాడ ట్రాఫిక్ డీసీపీ మీరా ప్రసాద్  చెప్పారు. ఆ ప్రమాదాల్లో మృతులు ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోతున్నారని,  ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రజల్లో హెల్మెట్ ధరించాలన్న అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో 3.5 లక్షల కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 2017లో 4 వేల డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని, 300 మందికి జైలు శిక్షలు పడ్డాయని, తాము చేపట్టిన చర్యల ద్వారా ప్రమాదాలు తగ్గినట్లు చెప్పారు.

అనంతరం, రూరల్ ఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోవడం బాధాకరమని, యువకులు తమ వాహనాల వేగంతోపాటు మనసు వేగం కూడా తగ్గించాలని కోరారు. ఆర్టీఏ అధికారి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ, నిన్న ఒక్క రోజు 5 వేల మంది డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. వారిలో 3500 మంది పరీక్ష పాసయ్యారని, వారికి ఎల్ఎల్ఆర్ లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు వంద మంది టెస్ట్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు చెప్పారు.

 ఈ సందర్భంగా పలువురికి ఎల్ఎల్ఆర్ లను అచ్చెన్నాయుడు అందజేశారు. 13 జిల్లాలలకు చెందిన పోలీస్, ట్రాఫిక్ అధికారులకు స్పీడ్ గన్లు, శ్వాస పరీక్ష పరికరాలు అందజేశారు. జెండా ఊపి టోవింగ్ వాహనాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, అడిషనల్ కమిషనర్ పి.శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News