Rahul Gandhi: మోదీ ఫోన్ ను చూడండి.. 'మేడ్ ఇన్ చైనా' అని ఉంటుంది: రాహుల్ గాంధీ

  • జిన్ పింగ్ తో మోదీ సమావేశం సామాన్య ప్రజలకు అవసరం లేదు
  • మోదీ హామీ ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడ?
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తాం

'మేకిన్ ఇండియా' అంటూ ప్రచారం చేసుకోవడమే తప్ప ఉద్యోగాలను కల్పించింది మాత్రం లేదని ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే యువతకు ఉద్యోగాలను కల్పించగలదని, రైతులకు భరోసా ఇవ్వగలదని చెప్పారు. మధ్యప్రదేశ్ లోని మండసౌర్ లో నిర్వహించిన ఓ బహిరంగసభలో ప్రసంగిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని అన్నారు.

సంపన్న పారిశ్రామికవేత్తలతో సంబంధాలు, చైనాతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడానికే బీజేపీ పెద్దలు ప్రాధాన్యతను ఇస్తున్నారని రాహుల్ విమర్శించారు. మోదీ హామీ ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఎక్కడ అని ప్రశ్నించారు. రైతులకు ఆర్థిక భరోసా ఎక్కడుందని నిలదీశారు. మేకిన్ ఇండియా కార్యక్రమం ఏమైందని ప్రశ్నించారు. 'ప్రధాని మోదీ ఫోన్ ను చూడండి. దానిపై మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది' అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు అధికారాన్ని అప్పగిస్తే ఫోన్లపై మేడ్ ఇన్ మండసౌర్ అని ఉంటుందని చెప్పారు.

చైనాతో నెలకొన్న డోక్లాం సమస్యపై ప్రధాని మాట్లాడటం లేదని... చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మోదీ సమావేశం సామాన్యులకు అవసరం లేదని రాహుల్ అన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మేహుల్ చోస్కీలకు కోట్లాది రూపాలయతో దేశం విడిచివెళ్లే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగించిందని మండిపడ్డారు. సామాన్యుడి డబ్బు సామాన్యుడిదే అనే భరోసాను కాంగ్రెస్ ఇస్తుందని చెప్పారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాహుల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 రోజుల్లోగా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాలను కల్పిస్తామని, సామాన్యులు గౌరవంగా బతికేలా చేస్తామని భరోసా ఇచ్చారు. మోదీ మన్ కీ బాత్ కాంగ్రెస్ కు అవసరం లేదని... ప్రజల మన్ కీ బాత్ నే తాము నమ్ముతామని చెప్పారు. 

  • Loading...

More Telugu News