Rahul Gandhi: ఇకపై కాంగ్రెస్‌కు వరుస విజయాలు.. 2019లో అధికారం మాదే: రాహుల్ గాంధీ

  • జనాక్రోశ్ ర్యాలీలో మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్
  • ఈయన అసలు ప్రధానేనా? అని నిలదీత
  • భారత్‌ను సంపూర్ణంగా మార్చేందుకు 60 నెలల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి

కాంగ్రెస్ ఇక విజయాల బాటలో పయనిస్తుందని, మేలో జరగనున్న కర్ణాటక ఎన్నికలు సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన జనాక్రోశ్ సభలో రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాహుల్ నిర్వహించిన తొలి బహిరంగ సభ ఇదే.

సభలో రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో త్వరలో గణనీయమైన మార్పు కనిపించబోతోందన్నారు. కాంగ్రెస్ ఇక వరుసపెట్టి విజయాలను సొంతం చేసుకుంటుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించి గద్దెనెక్కుతామని ధీమా వ్యక్తం చేశారు. పనిలో పనిగా మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఈయనేం ప్రధాని’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డోక్లాంలో చైనా హెలీప్యాడ్ నిర్మిస్తుంటే మన ప్రధానేమో చైనా పర్యటనకు వెళ్లొచ్చారని ఆక్షేపించారు. చైనా అధ్యక్షుడితో కలిసి చాయ్ తాగిన ఆయన డోక్లాం విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.

ఏటా రెండు కోట్లమందికి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారని, కానీ, ఇప్పుడు ఎక్కడ చూసినా నిరుద్యోగం తప్ప ఇంకోటి కనిపించడం లేదన్నారు. ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అన్నవారే వారిపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఓ బీజేపీ ఎమ్మెల్యే మహిళపై అత్యాచారం చేశారని రాహుల్ గుర్తు చేశారు. దేశాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తనకు ఐదేళ్ల సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా రాహుల్ కోరారు.

  • Loading...

More Telugu News