Andhra Pradesh: ఏపీలో వచ్చే నెలలో చిరు ధాన్యాల ఆహారోత్పత్తుల తయారీపై శిక్షణ

  • వచ్చే నెల 15, 16 తేదీల్లో శిక్షణ
  • యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులకు సబ్సిడీ  
  •  ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి

చిరుధాన్యాల ఆహారోత్పత్తుల తయారీలో వచ్చే నెల 15, 16 తేదీల్లో రెండ్రోజుల పాటు శిక్షణ
ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా చిరుధాన్యాల ఆహారోత్పత్తుల తయారీ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులకు ప్రభుత్వం 25 శాతం వరకూ సబ్సిడీ అందజేయనుంది. ఈ మేరకు  ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి వైఎస్.ప్రసాద్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుత సమాజంలో రాగి, సజ్జలు, జొన్నలు, చిరుజొన్నలు వంటి చిరుధాన్యాల ఆహారోత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉందని, ఈ ఆహారోత్పత్తుల తయారీపై వచ్చే నెల 15, 16 తేదీల్లో రెండ్రోజుల పాటు హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్(ఐ.ఐ.ఎం.ఆర్) తన క్యాంపస్ లో శిక్షణ ఇవ్వనుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన ఔత్సాహికులు రూ.10 వేలను ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని, ఈ మొత్తాన్ని ఔత్సాహికుల రవాణా, భోజ, వసతి సౌకర్యాలకు వినియోగిస్తారని, ఈ ఫీజును ఎన్ఐఈఎల్ఏఎన్ టీబీఐ పేరిట ఉన్న ఐఐఎంఆర్ అకౌంట్ లోజమ చేయాలని అన్నారు.

రెండ్రోజుల శిక్షణే కాకుండా దీర్ఘకాలిక శిక్షణ కూడా ఐ.ఐ.ఎం.ఆర్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. చిరుధాన్యాల ఆహారోత్పత్తుల తయారీలో ప్రావీణ్యం సాధించడమే కాకుండా వాటి అమ్మకాల కోసం యూనిట్ స్థాపించాలనుకున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆయా యూనిట్ల స్థాపనలో 25 శాతం వరకూ సబ్సిడీ అందజేయనుందని ఆ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ రూపొందించిన దరఖాస్తును పూర్తి చేసి ఏపీఎఫ్ పీఎస్ @ యాహూ.కామ్ కు మెయిల్ చేయాలని, పూర్తి వివరాలకు + 91-8662972223 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని కోరారు.

  • Loading...

More Telugu News