Telangana: తనపై అసత్య వార్తలు రాస్తున్నారంటూ కంటతడిపెట్టిన వీహెచ్!
- నాపై తప్పుడు కరపత్రాలు ప్రచురించిన వారిపై దావా వేస్తా
- సొంత పార్టీ నేతలే ఇలా చేయడం పార్టీకే నష్టం
- పత్రికలపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తా
తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) కంటతడిపెట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఏడుగురు నేతలను విమర్శిస్తూ కరపత్రాలు ప్రచురించారని, ఈ విషయమై పత్రికల్లో వార్తలు రాయడం అనైతికమని అన్నారు. తనపై తప్పుడు కరపత్రాలు ప్రచురించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
సొంత పార్టీ నేతలే ఒకరిపై మరొకరు ఈ విధంగా కరపత్రాలు ప్రచురించడం పార్టీకే నష్టమని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని పత్రికల్లో తనపై అసత్య వార్తలు రాస్తున్నారని, ఇలాంటి వార్తలు రాసే ముందు వాస్తవాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. తనపై ఈ విధంగా వార్తలు రాసిన వారిపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. పార్టీ కోసం నిరంతరం పాటుపడే తాను, ఎంతో మంది నాయకులను తయారు చేశానని, అలాంటి తనను బీసీలకు వ్యతిరేకమంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.