Rahul Gandhi: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రుల ఆగ్రహం

  • జీఎస్‌టీ గురించి ప్రపంచబ్యాంకు చాలా చ‌క్క‌గా విశ్లేషించింది: స్మృతి ఇరానీ
  • రాహుల్ గాంధీ సొంత దేశాన్ని ద్వేషించడం ఆశ్చర్యం కలిగిస్తోంది
  • ఓటమి నైరాశ్యంతోనే రాహుల్ ఇలా ఆరోపణలు చేస్తున్నారు: నిర్మలా సీతారామన్‌
  • సత్యానికి కట్టుబడ్డ పాండవులతో కాంగ్రెస్ పార్టీని పోల్చే అర్హత లేదు

బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా ఓ హ‌త్య కేసులో నిందితుడని, అలాగే, ప్రస్తుత ప్రభుత్వం అంచనాలకు అనుగుణంగా పని చేయడం లేదని ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు ఢిల్లీలో రెండో రోజు కొన‌సాగిన‌ కాంగ్రెస్ ప్లీన‌రీ స‌మావేశంలో తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌పై కేంద్ర‌ మంత్రులు మండిప‌డ్డారు. ఖాళీ సమయం ఉంటే రాహుల్ గాంధీ ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికను ఓ సారి పరిశీలించాల‌ని, జీఎస్‌టీ గురించి ప్రపంచబ్యాంకు చాలా చ‌క్క‌గా విశ్లేషించిందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ సొంత దేశాన్ని ద్వేషించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భారత్‌ ర్యాంకు మెరుగుపడిందని ప్రపంచ బ్యాంకు చెబుతుంటే, రాహుల్ గాంధీ ఆ నివేదికను కొట్టిపారేస్తున్నారని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ... ఓటమి నైరాశ్యంతోనే రాహుల్ ఇలా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాల‌న‌లో గ‌తంలో ఎమర్జెన్సీ విధించార‌ని, సిక్కులపై హింసను ప్రోత్సహించడం వంటి చర్యలకు పాల్పడ్డార‌ని పేర్కొన్నారు. సత్యానికి కట్టుబడ్డ పాండవులతో కాంగ్రెస్ పార్టీని పోల్చే అర్హత లేదని వ్యాఖ్యానించారు. అమిత్‌ షాపై వ‌చ్చిన ఆరోపణలను కోర్టు ఇప్ప‌టికే కొట్టివేసిందని తెలిపారు. రాహుల్ గాంధీ నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో బెయిల్‌పై విడుదలయ్యారని విమ‌ర్శించారు.     

  • Loading...

More Telugu News