Chandrababu: ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు!: వైసీపీకి సీఎం చంద్రబాబు హితవు
- విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు విజయవంతం
- ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు
- కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- బీజేపీతో గొడవ పెట్టుకుంటే లాభం లేదు
విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు విజయవంతం అయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏపీలో చాలా బలహీనంగా ఉన్నాయని, ఒకవేళ బీజేపీతో గొడవ పెట్టుకుంటే వారికి పోయేదేమీ లేదని, ఏపీకే నష్టమని సీఎం చెప్పారు.
కానీ, ఓ క్రమపద్ధతిలో పోరాడుతూనే రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకుందామని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని, తాము పెట్టుబడిదారులకు తప్పుడు లెక్కలు చూపిస్తున్నామని కొందరు ప్రచారం చేస్తున్నారని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి అన్నారు. పెట్టుబడులను సాధించడానికి తాము కృషి చేస్తుంటే, తప్పుడు ప్రచారం చేస్తూ ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు.