: యడ్యూరప్ప రెండు లక్ష్యాల్లో ఒక్కటే నెరవేరింది
బీజేపీలో బలమైన నేతగా చక్రం తిప్పి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన నేతల్లో యడ్యూరప్ప ఒకరు. మొదటి నుంచీ బీజేపీలో తన ప్రయాణాన్ని సాగించారు. కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. చివరికి తన మూర్ఖత్వం, మొండితనంతో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అధికారం కోసం గాలి సోదరులతోపాటు ఇతరులను చూసీ చూడనట్లు వదిలేశారు. ఈ అలసత్వమే ఆయనకు ప్రతికూలంగా మారింది.
గాలి సోదరుల అక్రమాల, అవినీతి చరిత్ర వెలుగు చూడడం, తర్వాత యడ్యూరప్ప అవినీతిపై లోకాయుక్త కేసు దాఖలు చేయడం తదనంతర పరిణామాలతో అయిష్టంగా ముఖ్యమంత్రి పీఠం నుంచి అప్ప వైదొలిగారు. అయినా తన అనుచరుడు సదానంద గౌడకే సీఎం పీఠం ఇప్పించారు. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి పీఠం కోసం అధిష్ఠానంతో తలపడి ఫలితం లేకపోవడంతో పార్టీ వీడి కర్ణాటక జనతా పార్టీని స్థాపించారు.
యడ్డి రెండు లక్ష్యాలను విధించుకున్నారు. ఒకటి తనను పక్కన పెట్టిన బీజేపీని కన్నడనాట చావుదెబ్బతీయడం. రెండు కర్ణాటక జనతాపార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మళ్లీ రాష్ట్రాన్ని ఏలడం. తద్వారా తానేంటో బీజేపీకి చూపించడం. అయితే ప్రస్తుత ఎన్నికల్లో యడ్డి లక్ష్యాల్లో ఒక్కటే నెరవేరింది. బీజేపీ అధికారం నుంచి దూరం అయింది. బీజేపీ ఓటు బ్యాంకు చీల్చడం ద్వారా చాలా స్థానాలలో ఆ పార్టీని ఒడించగలిగారు. కానీ, యడ్డి పార్టీ కూడా ఏమంత ప్రభావం చూపలేదు. ఇది యడ్డికి జీర్ణించుకోలేనిదే! ఈ పరిస్థితి చూస్తుంటే అప్ప మళ్లీ కాషాయ కండువా కప్పుకునే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినది ఏమంటే.. కాంగ్రెస్ కు అధికారం అదృష్టం కొద్దీ వచ్చినట్లే. ఎందుకంటే అధికారంలోని బీజేపీ ఓటు బ్యాంకును యడ్డి చీల్చారు. పైగా, ప్రతిపక్షంగా కాంగ్రెస్ కు కొంత సానుకూలత కలసి వచ్చింది. మరోవైపు జేడీఎస్, వీటన్నింటి మధ్య ఓట్ల చీలిక అంతిమంగా కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టడానికి కారణమయ్యాయి.