Rahul Gandhi: తప్పుడు హామీలిచ్చే వారిని నమ్మొద్దు : రాహుల్

  • బళ్లారి బహిరంగ సభలో మోదీపై  కాంగ్రెస్ చీఫ్ నిప్పులు
  • తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందని వెల్లడి
  • కర్నాటకలో 4 రోజుల టూర్‌లో యువరాజు బిజీ బిజీ

కర్ణాటక రాష్ట్రంలో తన నాలుగు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు శనివారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. "తప్పుడు హామీలు ఇచ్చే వారిని, మీకు సాకారం కాని కలల గురించి చెప్పేవారిని నమ్మొద్దు" అంటూ మోదీ సర్కార్‌పై రాహుల్ విరుచుకుపడ్డారు.

బళ్లారిలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిందని ఆయన గుర్తు చేశారు. కానీ మోదీ ప్రభుత్వం ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేకపోయిందని ఆయన విమర్శించారు. ఇటీవల పార్లమెంటులో మోదీ చేసిన ప్రసంగంపై ఆయన మాట్లాడుతూ....ప్రధానమంత్రి దేశ భవిష్యత్తు గురించి గానీ పురోగతి గురించి గానీ మాట్లాడలేదని అన్నారు.

"నరేంద్ర మోదీ పార్లమెంటులో గంటసేపు సాగిన తన ప్రసంగంలో దేశ భవిష్యత్తు గురించి గానీ లేదా యువతకు ఉపాధి కల్పన గురించి గానీ లేదా రైతులకు సాయం గురించి గానీ మాట్లాడలేదు. గంట సేపు ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి గతం గురించి మాత్రమే మాట్లాడారు. ఆయన భవిష్యత్తు గురించి ఏమి చెబుతారో వినాలని యావత్ భారతదేశం కోరుకుంది" అని రాహుల్ తీవ్రంగా విమర్శించారు.

కాగా, త్వరలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ అక్కడ పర్యటిస్తూ, పలు బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొంటూ పార్టీ నేతలు, కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. రేపటి పర్యటనలో రాయచూర్, యాదగిరి, కాలాబుర్గి జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. ఆఖరి రోజైన మంగళవారం నాడు కాలాబుర్గి జిల్లాలోని వృత్తినిపుణులు, వ్యాపార వర్గాలతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత బీదర్ జిల్లాలోని అనుభవ మంటప దర్శనం కోసం చాపర్‌లో బసవకళ్యాన్ వెళతారు.

  • Loading...

More Telugu News