Chandrababu: ఫలించిన ఏపీ ఫైబర్ నెట్ ప్రయత్నాలు.. దావోస్ నుంచి మారుమూల ప్రాంతం జాజివలస ప్రజలతో చంద్రబాబు ముచ్చట
- తొలిసారి గ్రామానికి అంతర్జాల సదుపాయం
- వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన చంద్రబాబు
- ఇప్పటి వరకు ఫోను సౌకర్యం కూడా లేని గ్రామం
- గూగుల్ ఎక్స్ సహకారంతో ఫోను, కేబుల్ టీవీ, నెట్ సదుపాయం
జాజివలస... కొండలు, కోనల నడుమ మారుమూల జనజీవన స్రవంతికి దూరంగా, కనీసం ఫోను సదుపాయానికి కూడా నోచుకోకుండా ప్రకృతి ఒడిలో మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉండే ఓ అందాల సీమ. తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం, కనివాడ పంచాయతీ పరిధిలోని ఈ గ్రామానికి ఇప్పటి వరకు ఎవరైనా వెళితే కనీసం మాట్లాడటానికి ఎలాంటి ఫోను సదుపాయం, నెట్ కనెక్షన్ ఉండేది కాదు. అలాంటి గిరిజన ప్రాంతాన్ని అక్కడ ప్రజలు ఏ మాత్రం ఊహించని విధంగా దావోస్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వీడియో కాల్ ద్వారా పలకరించి, వారి యోగక్షేమాలు అడిగే సరికి జాజివలస ప్రజలు సంభ్రమాశ్చర్యాలతో పులకించిపోయారు.
రంపచోడవరం నుంచి దాదాపు 80 కిలో మీటర్ల దూరంలో ఉండే ఈ పల్లెను తొలిసారిగా ఈ రోజు ఫోను, ఇంటర్‌నెట్, కేబుల్ టీవీ సదుపాయాలు పలకరించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సంస్థ వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ మారుమూల గిరిజన గ్రామాన్ని సాధారణ జనంతో మమేకయ్యేలా కనెక్టివిటీ కల్పించింది. జాజివలసకు కల్పించిన ఈ సదుపాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు.
జాజివలసకు కల్పించిన నవ సాంకేతిక సదుపాయం పనితీరు ఎలా ఉందో స్వయంగా అక్కడ గిరిజనులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఫోను ద్వారా వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి అక్కడ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. 'ఈ సదుపాయం ఎలా ఉంది, దీనిద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయ'ని అనుకుంటున్నారు... అని ఆయన గిరిజనులను అడిగారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కలలో కూడా ఊహించని విధంగా స్వయంగా ఇలా ముఖ్యమంత్రి తమను పలుకరించే సరికి ప్రజలు ఆనందడోలికల్లో తేలిపోయారు. 'సారూ..చాలా సంతోషం సారూ, మీరు మాతో ఇలా మాట్లాడటం, మా ఊరికి ఫోను ఇచ్చినారు మీరు.. మీకు కృతజ్ఞతలు' అని జాజివలస మహిళలు తెలిపారు. తమ ఊరికి తాము ఊహించని విధంగా రోడ్డు కూడా వేస్తున్నారని అది తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... 'ఒక్క ఫోను ఏంటమ్మా, మీ ఊరికి ఇప్పుడు ఇంటర్‌నెట్, కేబుల్ టీవీ అన్నీ వచ్చాయి. టెలీమెడిసిన్.. ఒక్కటేమిటీ దీనివల్ల మీకు తెలియని ప్రయోజనాలు మీకు ఎన్నో కలగబోతున్నాయి' అన్నారు. జాజివలసకు ఫైబర్ నెట్ సదుపాయం కల్పించడం తనకు చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. (జాజివలస గ్రామం)
ఫైబర్ నెట్ సంస్థకు అభినందనలు...
జాజివలస గిరిజన గ్రామానికి వైర్‌లెస్ నెట్ సదుపాయాన్ని దిగ్విజయంగా కల్పించిన ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సంస్థను, ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అహ్మద్ బాబు, అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. 'గుడ్ చాలా బాగా చేశారు, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఇలా ఏ మాత్రం కనెక్టివిటీ లేని ప్రాంతాలకు ఇదే తరహా కనెక్టివిటీని కల్పించాలి' అని సూచించారు. జాజివలకు ఈ సదుపాయం ఎలా కల్పించిందో ఫైబర్‌నెట్ సీఈఓ ఎ.బాబు వివరించారు.
ప్రపంచంలోనే తొలిసారి...
ఏ మాత్రం కమ్యూనికేషన్ సదుపాయం కల్పించడానికి అవకాశం లేని మారు మూల ప్రాంతాలకు కూడా ఇలా ఏకంగా టెలీఫోను, కేబుల్ టీవీ, ఇంటర్‌నెట్ సదుపాయాన్ని వైర్‌లెస్ ద్వారా కల్పించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని ఫైబర్ నెట్ వర్గాలు తెలిపాయి. దీనికోసం ఫైబర్ నెట్ సంస్థ గూగుల్ ఎక్స్ సంస్థ సహకారం తీసుకుని ఎఫ్.ఎస్.ఒ.సి ద్వారా ఈ సదుపాయం కల్పించింది. దీనికోసం ఏపీ ఫైబర్ నెట్ చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి.
ఏమిటీ ఎఫ్.ఎస్.ఒ.సి...
ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ (ఎఫ్.ఎస్.ఒ.సి) అనేది గూగుల్ ఎక్స్ సంస్థ అందిస్తున్న సరికొత్త సాంకేతిక సదుపాయం. ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ సాంకేతిక సదుపాయం. ఏ మాత్రం సెల్ ఫోను సిగ్నళ్లు లేని, కేబుల్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ సదుపాయం కల్పించడానికి వీలులేని మారుమూల ప్రాంతాలకు వైర్‌లెస్ ద్వారా అన్ని రకాల కనెక్టివిటీ కల్పించడమే దీని ప్రత్యేకత. 20 కిలో మీటర్ల పరిధిలో దీని ద్వారా 20 జీబీపీఎస్ (గిగా బైట్స్ పర్ సెకండ్) వేగంతో ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించవచ్చు.
ఎలాంటి కేబుల్ లేకుండానే ఆ ప్రాంత ప్రజలకు టెలిఫోను, అంతర్జాలం, కేబుల్ టీవీ ప్రసారాలను కల్పించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, సలహాలు, సూచనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సంస్థ రాష్ట్ర ప్రజలకు ఈ తరహా సదుపాయాన్ని కల్పిస్తోంది. తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం, కనివాడ పంచాయతీకి చెందిన జాజివలసకు ఈ సదుపాయం కల్పించింది. దశల వారీగా మిగిలిన ప్రాంతాలకు కూడా ఈ సదుపాయం కల్పించనున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ సీఈఓ ఎ.బాబు తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్నెట్, అంతర్జాలం, కేబుల్ టీవీ సదుపాయం లేని ఆవాసాలు అనేవి ఉండకూడదనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఈ లక్ష్య సాధనకు ఫైబర్ నెట్ సంస్థ పునరంకితమవుతోందని తెలిపారు.
రాష్ట్రపతి ప్రశంసలు..
ఏపీ ఫైబర్‌నెట్ పనితీరుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసలు, అభినందలు కూడా లభించాయి. ఇటీవలే ఆయన వెలగపూడి సచివాలయం నుంచి ఏపీ ఫైబర్ నెట్‌ను జాతికి అంకితం చేస్తూ సంస్థ పనితీరును, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతను ప్రశంసించారు. మిగిలిన రాష్ట్రాలకు ఏపీ ఫైబర్ నెట్ ఆదర్శం కావాలని సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ అమలు చేస్తున్న ఫైబర్ నెట్ విధానాన్ని అనుసరించాలని అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసింది. పలు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి ఇక్కడ ఏపీ ఫైబర్‌నెట్ అమలు తీరును అధ్యయనం చేసి తమ రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టడం సంస్థ పనితీరుకు చిరు నిదర్శనం.