Chandrababu: పకడ్బందీగా ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్స్ నిర్వహించాలి: ఏపీ మంత్రి గంటా ఆదేశాలు

  • ఇంట‌ర్ క‌ళాశాల‌ల ప్రిన్సిపాల్స్ తో వీడియో కాన్ఫ‌రెన్స్
  • ప్ర‌తి కేంద్రంలోనూ సీసీటీవీలను ఏర్పాటు
  • తొలిసారిగా ఎగ్జామిన‌ర్లకూ అమలు కానున్న జంబ్లింగ్ పధ్ధతి 

ఎలాంటి లోటుపాట్లు లేకుండా, పకడ్బందీగా ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్స్ నిర్వహించాలని ఏపీ మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఆదేశించారు. ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లపై కాకినాడలోని జేఎన్టీయూ సమావేశ మందిరంలో ఈరోజు వీడియా కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఇంట‌ర్ క‌ళాశాల‌ ప్ర‌ిన్సిపాల్స్ తో నిర్వహించిన ఈ సమీక్షలో గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాల‌ని, మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేందుకు సీసీటీవీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. విద్యార్థులు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్ మెంట‌ల్ ఎడ్యుకేష‌న్ ప‌రీక్ష త‌ప్ప‌నిస‌రిగా పాస్ కావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ నెల 27న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ప‌రీక్ష, 29న ఎన్విరాన్ మెంట‌ల్ ఎడ్యుకేష‌న్ ప‌రీక్ష జ‌రుగుతుంద‌ని, పార‌ద‌ర్శకంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించే నిమిత్తం ప్ర‌తి లేబ‌రేట‌రీలోనూ 2 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 21 వ‌ర‌కు ప్రాక్టిక‌ల్స్ జ‌రుగుతాయ‌ని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు ఒక సెష‌న్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వ‌ర‌కు మ‌రో సెష‌న్ లో ప‌రీక్ష‌లు జరుగుతాయ‌ని తెలిపారు.

గ‌తంలో విద్యార్థుల‌కు జంబ్లింగ్ విధానం వుండేద‌ని, ఇప్పుడు ఇన్విజ‌లేట‌ర్ల‌కు కూడా ఈ విధానాన్ని అమ‌లు చేస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు నేల‌పైన కూర్చొని ప‌రీక్ష‌లు రాస్తే స‌హించేది లేద‌ని, అవ‌స‌ర‌మైతే నిధులు తీసుకొని పూర్తి స్థాయిలో విద్యార్థుల‌కు మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్రాక్టిక‌ల్స్ ప‌రీక్ష‌లకు సంబంధించి జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను ఈ సంద‌ర్భంగా ఆర్.జే.డీలు వివ‌రించారు. 

  • Loading...

More Telugu News