vansi: కొండవలస అలా నా కంట్లో పడ్డారు .. అవకాశం ఇచ్చాను: దర్శకుడు వంశీ
- ఓ నాటిక వేస్తుండగా కొండవలసను చూశాను
- ఆయన నటన నచ్చడంతో అభినందించాను
- నేనెవరో ఆయనకి తెలియదు
- ఆ తరువాత తెలిసి షాక్ అయ్యాడు
ప్రముఖ దర్శకుడు వంశీ తన కెరియర్లో చాలామంది కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చారు. అలా ఆయన ఛాన్స్ ఇచ్చిన వాళ్లలో చాలామంది పాప్యులర్ అయ్యారు. అలాంటి వారిలో హాస్యనటుడు కొండవలస ఒకరు. ఆయన గురించి వంశీ మాట్లాడుతూ .. "ద్రాక్షారామం కళా పరిషత్ వారు 'అల్లదిగో అదే మా ఊరు' అనే నాటిక వేశారు. కాస్త దూరం నుంచి ఆ నాటికను నేను చూస్తున్నాను. సన్నగా వున్న ఒక వ్యక్తి ఎగిరి గంతులేస్తున్నట్టుగా భలేగా చేస్తున్నాడే అనిపించింది"
"నాటిక అయిన తరువాత ఆయనను చూస్తే .. పెద్దవాడాయన .. దగ్గర దగ్గరగా 60 యేళ్లు ఉంటాయి. నేను ఎవరన్నది చెప్పకుండగా .. చాలా బాగా చేశారండీ అన్నాను. 'మీ లాంటి కళాభిమానులు ఉన్నంతవరకూ మా లాంటి కళాకారులకు జీవితం ఉంటుంది' అన్నారు. అప్పుడు నేనెవరో ఆయనకీ తెలియదు. ఆ తరువాత హైదారాబాద్ వెళ్లి ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాక ఆయనకి కబురు చేశాను. నన్ను చూసిన ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు. 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' అనే సినిమాలో ఆయనకి 'పొట్టిరాజు' అనే వేషం ఇచ్చాను. ఆ సినిమా హిట్ కావడంతో .. ఆ పాత్ర పండటంతో ఆయన బాగా పాప్యులర్ అయ్యారు" అని చెప్పుకొచ్చారు.