‘పల్లె పల్లెకు నేతలు’: ఏపీలో జనవరి 27 నుంచి ‘పల్లె పల్లెకు నేతలు’ : జూపూడి ప్రభాకర రావు

  • జనవరి 27 నుంచి ఏప్రిల్ 20 వరకు ‘పల్లెపల్లెకు నేతలు’
  • ఏప్రిల్  20న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా బహిరంగ సభ
  • ఏపీలో మూడు రోజుల పాటు దళిత పార్లమెంట్: జూపూడి

ఏపీలో ప్రభుత్వ పథకాలపై దళితులకు అవగాహన కల్పించే నిమిత్తం ‘పల్లెపల్లెకు నేతలు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు పేర్కొన్నారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనవరి 27 నుంచి ఏప్రిల్ 20 వరకు 82 రోజుల పాటు ‘పల్లెపల్లెకు నేతలు’ కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని దళిత కుటుంబాలను కలుస్తామని చెప్పారు, బాబా సాహేబ్ అంబేద్కర్ ఆశయాలను సీఎం చంద్రబాబునాయుడు ఆచరణలో పెడుతున్నారని ఈ సందర్భంగా ప్రశంసించారు.

‘పల్లెపల్లెకు నేతలు’ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయాలను తెలియజెప్పేందుకు కరపత్రాలు, గోడ పత్రికలు, షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనల ద్వారా ప్రచారం కల్పిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా రెండు లక్షల మంది దళితులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆ రోజున ఏపీ రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ స్థాపనకు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని తెలిపారు.

ఏపీలో మహిళా పార్లమెంట్ నిర్వహించినట్టుగా రాష్ట్రంలో మూడు రోజుల పాటు దళిత పార్లమెంట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అమెరికా, లండన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలోని దళితులకు, దళితుల అభివృద్ధి కోసం పాటుపడే వారికి ఆహ్వానాలు పంపుతామన్నారు. విశాఖపట్నం జిల్లాలో దళిత మహిళపై జరిగిన దాడిని ఈ సందర్భంగా ఆయన ఖండించారు. ఈ సంఘటనలో నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జూపూడి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News