హీరో విజయ్: తమిళ హీరో విజయ్ కు అరుదైన గౌరవం... సీబీఎస్ఈ పాఠ్యపుస్తకంలో ఫొటో!
- సీబీఎస్ఈ మూడవ తరగతి పాఠ్యపుస్తకంలో విజయ్ ఫొటో
- తమిళనాడులో పురుషుల డ్రెస్సింగ్ స్టైల్ ను తెలియజెప్పేందుకే
- విజయ్ అభిమానుల సంతోషం
తమిళ హీరో విజయ్ కు అరుదైన గౌరవం లభించింది. సీబీఎస్ఈ మూడవ తరగతి పాఠ్యపుస్తకంలో విజయ్ ఫొటోను పొందుపరిచారు. తమిళ సంప్రదాయానికి అద్దం పట్టేలా పురుషులు ధోవతి, చొక్కా ధరించడం ఆనవాయతి. తమిళనాడులో పురుషుల డ్రెస్సింగ్ స్టైల్ ను విద్యార్థులకు తెలియజెప్పే నిమిత్తం పంచె, చొక్కా ధరించి ఉన్న విజయ్ ఫొటోను ఈ పాఠ్య పుస్తకంలో పొందుపరిచారు. తమిళనాడు లో చాలా ముఖ్యమైన పండగ ‘పొంగల్’ అని, రైతుల పండగ అని, జనవరి నెలలో మూడు రోజుల పాటు ఈ పండగను నిర్వహిస్తారని ఆ పుస్తకంలో రాశారు.
కాగా, ఇటీవల విడుదలైన ‘మెర్శల్’ చిత్రం (తెలుగులో ‘అదిరింది’)లో డాక్టర్ పాత్రలో విజయ్ నటించాడు. డాక్టర్ గా ఆయన అందించిన ఉత్తమ సేవలకు గాను విదేశంలో అవార్డును అందుకునేందుకు వెళ్లిన ఓ సన్నివేశం ఉంటుంది. తమిళ సంప్రదాయ దుస్తులు ధోవతి, చొక్కా ధరించి ఆ కార్యక్రమానికి విజయ్ హాజరవుతాడు. అయితే, ఆయన వేషధారణ చూసి అక్కడి సెక్యూరిటీ గార్డు అనుమానం వ్యక్తం చేయడం, ఆపై అసలు విషయం తెలుసుకుని క్షమాపణలు చెప్పడం, విజయ్ ని గౌరవించడం ఈ సన్నివేశంలో జరుగుతుంది. తమిళ సంప్రదాయానికి గౌరవాన్ని తీసుకువచ్చిన విజయ్ ఫొటోను సీబీఎస్ఈ పాఠ్యపుస్తకంలో పొందుపరచడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.