‘పోలవరం’: ‘పోలవరం’ ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకైనా వెళ్తా: సీఎం చంద్రబాబు
- ‘పోలవరం’ను సందర్శించిన చంద్రబాబు
- ప్రతిపక్షం అపోహలు సృష్టించి..అడ్డుకోవాలని చూస్తోంది
- అలాంటివి చేస్తుంటే చూస్తూ ఊరుకోం: చంద్రబాబు
ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకైనా తాను వెళ్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి సోమవారం ‘పోలవరం’పై సమీక్ష నిర్వహిస్తున్న ఆయన, ఈరోజు పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. కాఫర్ డ్యామ్, డయాఫ్రం వాల్ పనులను పరిశీలించారు. పనుల తీరు గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం, చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, ‘పోలవరం’లో కాంక్రీట్ వర్క్స్ మినహా ఇతర పనులు వేగవంతం చేశామని, కాంక్రీట్ పనులు పూర్తి చేసి కాఫర్ డ్యామ్ నిర్మిస్తే, వచ్చే ఏడాదిలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు. ‘పోలవరం’ ప్రాజెక్టుపై రూ.12,506 కోట్లు ఖర్చు చేశామని, పునరావాస ప్యాకేజ్ వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54 వేల కోట్లకు చేరుకుందని చెప్పారు.
తొంభై ఎనిమిది వేల గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించాలని, ప్రతి కుటుంబానికి సగటున రూ.18 లక్షలు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ‘పోలవరం’పై శ్వేతపత్రం గురించి ఆయన ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామని, రోజువారీ లెక్కలు చెబుతుంటే ఇంకా శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ‘పోలవరం’పై ప్రతిపక్షం అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తోందని, అలాంటివి చేస్తుంటే చూస్తూ ఊరుకోమని చంద్రబాబు హెచ్చరించారు.